అప్పుడు తండ్రులు ఢీ.. ఇప్పుడు తనయులు సై
రాజకీయాల్లో వారసుల ఎంట్రీ కామనే. ఎన్నికల్లో ఇలాంటి వారసులు పోటీ పడటం చూస్తూనే ఉంటాం
రాజకీయాల్లో వారసుల ఎంట్రీ కామనే. ఎన్నికల్లో ఇలాంటి వారసులు పోటీ పడటం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు వారసుల మధ్య పొలిటికల్ వార్ ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు వీళ్ల తండ్రులు ప్రత్యర్థులుగా తలపడగా.. ఇప్పుడు ఈ కొడుకులు ఎన్నికల సమరంలో సై అంటున్నారు. వాళ్లే మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి అమర్నాథ్, టీడీపీ తరపున శ్రీనివాసరావు బరిలో దిగారు.
ఇప్పుడు అమర్నాథ్, శ్రీనివాసరావు విజయం కోసం ఢీ అంటే ఢీ అంటున్నారు. కానీ గతంలో వీళ్ల తండ్రులు కూడా పరస్పరం తలపడ్డారు. అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాధరావు, శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం గతంలో ఎమ్మెల్యేలుగా పని చేశారు. 35 ఏళ్ల క్రితం గురునాధరావు, సింహాచలం ప్రత్యర్థులుగా పోటీపడటం గమనార్హం. అప్పట్లో పెందుర్తి నియోజకవర్గంలోనే గాజువాక ఉండేది. 1989 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గంలో సింహాచలంపై గురునాధరావు గెలిచారు. ఇప్పుడు మూడున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ వీళ్ల వారసుల మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది.
ఇప్పుడు అమర్నాథ్, శ్రీనివాసరావు మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ ఇద్దరూ తొలిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా గెలిచారు. పల్లా మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో బరిలో దిగారు. గుడివాడ ఏమో రెండో సారి పోటీకి సిద్ధమయ్యారు. గాజువాక నుంచి గుడివాడ తొలిసారి పోటీ చేయడంతో పల్లా శ్రీనివాసరావుతో సమరానికి సై అంటున్నారు. గత ఎన్నికల్లో అమర్నాథ్.. అనకాపల్లి నుంచి పోటీ చేశారు. ఇలా అప్పుడు తండ్రుల మధ్య పోటీ.. ఇప్పుడు తనయుల మధ్య సమరంగా మారింది. ఈ ఇద్దరు నాయకులూ తమదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరి వీళ్లలో ఎవరు గెలుస్తారన్నది ప్రజల చేతుల్లో ఉంది.