బీజేపీ ఎంపీ జీవీఎల్ కొత్త ఎత్తుగడ...ఆ సామాజిక వర్గంతో...!?
ఒక చాన్స్ ఇచ్చాం కదా అని ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లమని అంటున్నారు. దీంతో మూడేళ్ళ క్రితం నుంచి విశాఖ కేంద్రంగా చేసుకుని జీవీఎల్ తన రాజకీయ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మీడియాలో పనిచేసిన మనిషి కావడంతో ఆయన మీడియాలో ఎలా హైలెట్ కావాలో బాగా తెలిసిన వారు అని ప్రత్యర్ధులు అంటారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం ఈ ఏడాది ఏప్రిల్ 2తో ముగుస్తోంది. ఉత్తరప్రదేశ్ కోటాలో 2018లో ఆయన ఈ పదవిని అందుకున్నారు. ఈ రోజు కూడా యూపీలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మంచి మెజారిటీ కూడా వారికి ఉంది. కానీ జీవీఎల్ ని మళ్లీ ఎంపీని చేసి పెద్దల సభకు పంపడానికి బీజేపీ పెద్దలకు మనసు రావడం లేదు.
ఒక చాన్స్ ఇచ్చాం కదా అని ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లమని అంటున్నారు. దీంతో మూడేళ్ళ క్రితం నుంచి విశాఖ కేంద్రంగా చేసుకుని జీవీఎల్ తన రాజకీయ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అయితే టికెట్ వస్తుందో రాదో పొత్తులలో పురంధేశ్వరి వంటి వారు సీటు ఎగరేసుకుని పోతారేమో అన్న ఆందోళన అయితే జీవీఎల్ అనుచరులలో ఉంది.
ఇక జీవీఎల్ ఇపుడు కొత్త ఎత్తుగడకు తెర తీశారు అని అంటున్నారు. ఆయన పక్కా లోకల్ అనిపించుకోవడానికి ఇటీవల సంక్రాంతి సంబరాలు వంటి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే గణతంత్ర వేడుకల సందర్భంగా అనేక ఇతర కార్యక్రమాలు కూడా చేపట్టారు.
వీటితో పాటు ఆయన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఇతర సంఘాల నేతలతో సాన్నిహిత్యం నెరపుతున్నారు. ఇపుడు సొంత సామాజిక వర్గంలో బలం పెంచుకుంటున్నారు. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. విశాఖలో తాజాగా బ్రాహ్మణ సామాజిక వర్గం నిర్వహించిన భారీ సభ ద్వారా జీవీఎల్ తన ఆకాంక్షలను వెల్లడించారు. బ్రాహ్మణులకు పోరాడితే కానీ రాజకీయ హక్కులు రావని టికెట్లు ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు.
అన్ని సామాజిక వర్గాల మాదిరిగానే బలం చూపించాలని ఆయన కోరారు. బ్రాహ్మణులు అంతా ఐక్యంగా ఉండి తమ సత్తా చాటాలని వారు సంఘటితం అయితేనే పార్టీలు ఈ వైపు చూస్తాయని ఆయన అంటున్నారు. బీజేపీ కూడా జీవీఎల్ ని సామాజికవర్గం పరంగా బలహీనుడుగానే లెక్క వేస్తోంది. అయితే విశాఖలో జరిగిన బ్రాహ్మణ సదస్సులో జనాలు పెద్ద ఎత్తున తరలి రావడంతో తమ సామాజిక వర్గం అండ తనకు ఉందని జీవీఎల్ చెప్పుకున్నట్లు అయింది.
ఇక చూస్తే విశాఖ పార్లమెంట్ పరిధిలో పదమూడు లక్షల దాకా ఓటర్లు ఉంటే అందులో ఆరవ వంతు అంటే రెండు లక్షలకు పైగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఉంది. దాంతో ఈ లెక్కను అధినాయకత్వం ముందు పెట్టి టికెట్ సాధించాలని జీవీఎల్ చూస్తున్నారు. అదే విధంగా బ్రాహ్మణుల మద్దతు పూర్తిగా పొందితే తనకు రావాల్సిన మూలధనం లాంటి ఓటు పడుతుందని కూడా ఆయన అంచనా వేసుకుంటున్నారు.
మొత్తం మీద జీవీఎల్ మిగిలిన రాజకీయ నాయకుల మాదిరిగానే ఎత్తులతోనే ముందుకు సాగుతున్నారు. పొత్తులు ఉన్నా విశాఖ సీటుని తనకే అని కేంద్ర బీజేపీ పెద్దల నుంచి అనిపించుకునే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. అవి ఫలిస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.