రేర్ సీన్: గురువు రిటైర్ అయ్యే వేళ.. శిష్యుల సందడి
ఇలాంటి వేళలో.. కొందరు గురువుల తీరు మిగిలిన వారికి భిన్నంగా ఉండటమే కాదు.. వారి పుణ్యమా అని వందలాది మంది జీవితాల్ని మార్చేస్తుంటారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో గురు - శిష్య బంధం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గురువును శిష్యుడు ఎలా చూస్తాడన్నది తెలిసిందే. అదే సమయంలో శిష్యుడిని గురువు చూసే ధోరణిలో వచ్చిన మార్పు.. వారి మధ్య ఉండాల్సిన బంధం.. అనుబంధాన్ని పూర్తిగా మార్చేసింది. ఇలాంటి వేళలో.. కొందరు గురువుల తీరు మిగిలిన వారికి భిన్నంగా ఉండటమే కాదు.. వారి పుణ్యమా అని వందలాది మంది జీవితాల్ని మార్చేస్తుంటారు.
అలాంటి తమ మాస్టారును కొందరు శిష్యులు తాజాగా స్పందించిన తీరు తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు. తమ మాస్టారి రిటైర్మెంట్ వేళ.. పని కట్టుకొని రావటమే కాదు.. ఆయనకు ఘనమైన వీడ్కోలు పలికారు. తమ జీవితాలు ఈ రోజున ఇలా ఉన్నాయంటే.. అందుకు తమ గురువు చూపిన మార్గమేనంటూ వందలాది శిష్యులు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. గురు-శిష్యుల మధ్య ఉండే అనుబంధానికి గుర్తుగా వారు వ్యవహరించిన వైనం రేర్ సీన్ గా మారింది. దీనికి.. ఉమ్మడి నల్గొండ జిల్లా వేదికైంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ స్కూళ్లలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహించారు తూము హన్మంతరావు. తాజాగా ఆయనసూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పని చేస్తున్నారు. శనివారం ఆయన రిటైర్మెంట్. ఇప్పటికే ఆయన శిష్యుల్లో పలువురు పోలీసు శాఖలోనూ.. ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచి స్థానాల్లో పెద్ద ఎత్తున పని చేస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులుగా స్థిరపడ్డారు కూడా. ఈ రోజున తమ పొజిషన్ కు కారణమైన గురువును సత్కరించేందుకు వారు.. ఆయన రిటైర్మెంట్ రోజును భిన్నంగా ప్లాన్ చేశారు.
తమ గురువు హన్మంతరావు రిటైర్ రోజున.. ఆయన పని చేస్తున్న స్కూల్ కు మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న ఒక ఫంక్షన్ హాల్ ను సన్మానం కోసం బుక్ చేశారు. స్కూల్ నుంచి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి.. దాన్ని పూలతో అలంకరించి.. తాడుతో లాక్కుంటూ ఫంక్షన్ హాల్ వరకు తీసుకెళ్లారు. ఇందుకోసం 200 మంది శిష్యులు వాహనాన్నిలాగటం విశేషం. ఈ వాహనంలో తమ మాష్టారు.. ఆయన సతీమణిని ఎక్కించి.. ఫంక్షన్ హాల్ కు తీసుకెళ్లారు. తామీ రోజున మంచి స్థానాల్లో ఉద్యోగం చేస్తున్నామంటే అందుకు హన్మంతరావు మాస్టారి పుణ్యమే అంటూ ఆయనతో తమకున్న అనుబంధాన్నిభావోద్వేగంతో వివరించారు. మొత్తంగా గురువు - శిష్యుడి మధ్య అనుబంధం ఎలా ఉండాలన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా తాజా ఉదంతం నిలిచిందని చెప్పాలి.