బటన్ నొక్కితే బతికే కర్మ మనకు లేదు.. హరీష్ శంకర్

నేడు ఏపీలో పోలింగ్ జరుగుతున్న వేళ.. హరీష్ శంకర్ సంచలన ట్వీట్ చేశారు.

Update: 2024-05-13 06:05 GMT

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను తీస్తూ ప్రతి హీరో ఫ్యాన్‌ ను తృప్తి పరిచే దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌ లో స్క్రీన్ రైటర్‌ గా వర్క్ చేసిన హరీష్.. షాక్ చిత్రంతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో మిగతా హీరోలతో పోలిస్తే పవన్ కళ్యాణ్‌, రవితేజతో హరీష్ కు మంచి బాండింగ్ ఉంది. ప్రస్తుతం వీరిద్దరితో ఉస్తాద్ భగత్ సింగ్, మిస్టర్ బచ్చన్ సినిమాలు చేస్తున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో.. బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి హరీష్ శంకర్ ఎప్పటి నుంచో మద్దతు తెలుపుతూనే ఉన్నారు. నేడు ఏపీలో పోలింగ్ జరుగుతున్న వేళ.. హరీష్ శంకర్ సంచలన ట్వీట్ చేశారు. రాజకీయాల్లో పెద్ద ఎత్తున డబ్బు సంపాదించిన నాయకులకు కాకుండా.. కష్టపడి సంపాదించిన డబ్బును ఖర్చు చేసే నాయకుడికి ఓట్లు వేయాలని హరీష్ శంకర్ ప్రజలను కోరారు.

"రాజకీయాల్లో వచ్చి సంపాదించిన నాయకులు కాదు.. సంపాదించింది రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం ఖర్చు పెట్టిన నాయకుడిని గుర్తించండి. ఎవరో బటన్ నొక్కితే బతికే కర్మ మనకు లేదు. మన బటన్ మనమే నొక్కాలి.. అదే ఈ ఈవీఎం బటన్ అవ్వాలి. ఓటు మన హక్కు మాత్రమే కాదు మన బాధ్యత కూడా" అని ఎక్స్ (అప్పటి ట్విట్టర్) లో హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పోలింగ్ వేళ పోస్ట్ పెట్టారు.

ఇక పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈ సారి గెలుపొందాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆయన కోసం మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా రంగంలోకి దిగారు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్ పిఠాపురంలో ప్రచారం చేశారు. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని వీడియో ద్వారా కోరారు.

హీరో రామ్ చరణ్, ఆయన తల్లి సురేఖ.. ప్రచారం చివరి రోజు పిఠాపురానికి వెళ్లారు. వారితోపాటు నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారు. పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని పవన్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ఆ సమయంలో బాబాయ్, అబ్బాయ్ కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ అందరిలో జోష్ నింపారు. ఎందరో సెలబ్రిటీలు కూడా పవన్ కు మద్దతు తెలిపారు. మరి ఆయన ఎలాంటి విజయం సాధిస్తారో చూడాలి.

Tags:    

Similar News