హసీనాను వేధించిన అమెరికా.. గత ఏడాదే జోక్యం చేసుకున్న భారత్
సందు దొరికితే ఇతర దేశాల్లో చేసుకునే రకం అమెరికా. ఇలానే బంగ్లాదేశ్ లో హసీనా ప్రభుత్వం ఎన్నికలకు ముందు పలువురిని జైళ్లలో వేయడాన్ని అమెరికా దౌత్యవేత్తలు తప్పుబట్టారు.
బంగ్లాదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టి.. హసీనాను కాలు బయటపెట్టేలా చేసింది అమెరికా.. వరుసగా నాలుగోసారి గెలిచిన ఆమెను నాలుగు నెలలైనా ప్రశాంతంగా ఉండనివ్వలేదు.. దీనిని హసీనా కూడా స్పష్టం చేశారు. సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో అమెరికా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించకపోవడంతో హసీనా జాతకాన్ని మార్చేసిందని చెబుతున్నారు. అయితే, హసీనాను అమెరికా వేధిస్తున్నట్లు గతంలోనే భారత్ కు తెలిసింది.. ఆమె పట్ల వైఖరి మార్చుకోవాలని కూడా కోరింది. చివరకు అదేమీ పనిచేయనట్లుగా కనిపిస్తోంది.
ఇతర దేశాల్లో జోక్యం
సందు దొరికితే ఇతర దేశాల్లో చేసుకునే రకం అమెరికా. ఇలానే బంగ్లాదేశ్ లో హసీనా ప్రభుత్వం ఎన్నికలకు ముందు పలువురిని జైళ్లలో వేయడాన్ని అమెరికా దౌత్యవేత్తలు తప్పుబట్టారు. తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే ఆంక్షలు విధిస్తామని కూడా అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. అంతేగాక.. బంగ్లా పోలీస్ విభాగం ఒకదానిపై ఆంక్షలు విధించింది. ఇది హసీనా పార్టీ అవామీ లీగ్ అధినేత కింద పనిచేస్తుందని చెబుతారు. ఇలా వరుసగా పరిణామాలు జరుగుతుండడంతో భారత్ స్పందించింది. పలుసార్లు అమెరికాతో చర్చలు జరిపింది.
హసీనాపై మొండిగా వెళ్లొద్దు..
హసీనా విషయంలో మరీ మొండిగా ఉండొద్దంటూ భారత్ అమెరికాను కోరిందని వాషింగ్టన్ పోస్టు తాజాగా పేర్కొంది. బంగ్లాలో అప్పటి ప్రతిపక్షాలు బలపడితే ఇస్లామిక్ అతివాద శక్తులకు కేంద్రంగా మారుతుందని కూడా హెచ్చరించింది. ఇది తమ భద్రతకూ సవాల్ అని పేర్కొంది. ప్రజాస్వామ్యం కోసం మీరు చేపట్టే చర్యలు.. తమకు చాలా తీవ్రంగా మారి అస్తిత్వానికి ముప్పు కలుగుతుందని కూడా స్పష్టం చేశారు. వ్యూహాత్మక ఏకాభిప్రాయం లేకపోతే.. వ్యూహాత్మక భాగస్వామి కూడా కాలేరని తేల్చి చెప్పింది. దీంతోనే అమెరికా అధ్యక్షుడు బైడెన్ టీమ్ హసీనా, ఆమె అధికారులపై ఆంక్షల విషయంలో వెనక్కు తగ్గింది.
పరిస్థితి అదుపుతప్పిందా?
హసీనా దిగిపోయిన పది రోజులు దాటిన నేపథ్యంలో బంగ్లాలో పరిస్థితి దారితప్పిందా? అని భారత్-అమెరికా విశ్లేషణలో పడ్డాయి. తమ అంచనాలకు భిన్నంగా ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు అలాంటి భాగస్వాములతో కలిసి పనిచేయాల్సి ఉంటుందంటూ అమెరికా అధికారి ఒకరు పేర్కొనడాన్ని బట్టి చూస్తే హసీనా విషయంలో వారు పశ్చాత్తాప పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, బంగ్లాలో జనవరిలో జరిగిన ఎన్నికలకు ముందే హసీనాపై కఠినంగా ఉండాలని అమెరికా రాయబారి పీటర్ హాస్ కోరినట్లుగా కథనాలు వచ్చాయి. ఆ దేశ విదేశాంగ శాఖ కూడా బంగ్లా ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా సాగలేదని ఆరోపించింది. హసీనా ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరంగా మారింది. కొన్ని నెలలు మౌనంగా ఉన్న ఆమె.. వైమానిక స్థావరం కోసం అనుమతి ఇస్తే.. తన ఎన్నిక సాఫీగా జరిగేలా చూస్తామని ఓ దేశం చెప్పినట్లు మేలో ఆరోపించారు. ఇప్పుడు బయటకు వస్తున్న కథనాలను చూస్తుంటే అమెరికా-హసీనా మధ్య సంబంధాలు లేవని స్పష్టం అవుతోంది.