సూటు, బూటుతో దర్పం.. ఇన్‌ కం ట్యాక్స్‌ ఆఫీసర్‌ నంటూ బురిడీ!

ఒక వ్యక్తి ఆదాయపన్ను అధికారినంటూ దుర్గమ్మ గుడి సిబ్బందిని బోల్తా కొట్టించడానికి ప్రయత్నించాడు.

Update: 2024-03-06 07:31 GMT

తాను ఉన్నతాధికారినని, ఫలానా జాతీయ కమిషన్‌ చైర్మన్‌ నని చెప్పుకుంటున్న కొందరు పలు తప్పుడు పనులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఉన్నతాధికారుల మాదిరిగానే సూటు, బూటు, డాబు, దర్పంతో ఎక్కడా అనుమానం రాకుండా మోసగాళ్లు ప్రవర్తిస్తున్నారు. దీంతో అంతా మోసపోతున్నారు.


తాజాగా ఇలాంటి ఘటనే విజయవాడలో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఆదాయపన్ను అధికారినంటూ దుర్గమ్మ గుడి సిబ్బందిని బోల్తా కొట్టించడానికి ప్రయత్నించాడు. సూటు, బూటు, మెళ్లో ఐడీ కార్డును వేసుకున్న ఆ వ్యక్తి తాను ఆదాయపన్ను విభాగంలో ఉన్నతాధికారినని దేవస్థానం సిబ్బందికి చెప్పాడు. అయితే ఆ వ్యక్తి వద్ద రెండు ఐడీ కార్డులు ఉండటంతో అనుమానమొచ్చిన ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదాయ పన్ను జాయింట్‌ కమిషనర్‌ వి. శ్రీనివాస్, ఆనంద్‌ పేర్లతో ఉన్న ఐడీ, విజిటింగ్‌ కార్డులతో ఓ వ్యక్తి తరుచూ విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వస్తున్నట్లు ఆలయ అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలో అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అతడు తాను ఉన్నతాధికారిననే దర్పంతో ఆలయ సిబ్బందితో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడు. దీంతో అనుమానమొచ్చిన ఆలయ సిబ్బంది ఆయన వద్ద ఉన్న గుర్తింపు కార్డులు చూపించాలని కోరారు. ఈ క్రమంలో నిందితుడు మొదట ఆనంద్‌ పేరుతో ఉన్న గుర్తింపు కార్డును, ఆ తర్వాత శ్రీనివాస్‌ పేరిట ఉన్న మరో కార్డు చూపాడు. దీంతో ఆలయ అధికారులకు అనుమానం మరింత పెరిగింది. గతంలోనూ పలుమార్లు ఇతడు ఇదే తరహాలో వీఐపీ దర్శనం చేసుకున్నాడని నిర్ధారించారు. అంతేకాకుండా ఆలయ పర్యవేక్షకులు, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడని తెలుసుకున్నారు.

ఈ క్రమంలో తాజాగానూ నిందితుడు ఆలయ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో సిబ్బంది గట్టిగా ప్రశ్నించారు. ఇంతలో అవుట్‌ పోస్టులోని పోలీసు సిబ్బంది వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారించాలని ఈవో రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరో వైపు ఆలయ అధికారులు ఇన్‌ కం ట్యాక్స్‌ అధికారులతో మాట్లాడి నిందితుడు నిజంగా ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆనంద్, శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఎవరూ తమ వద్ద పనిచేయడం లేదని ఇన్‌ కం ట్యాక్స్‌ అధికారులు నిర్ధారించారు. దీంతో నిందితుడిని వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌ కు తరలించారు. విజయవాడ వెస్ట్‌ ఏసీపీ మురళీ కృష్ణారెడ్డి అతడిని విచారిస్తున్నారు

Tags:    

Similar News