వైసీపీ ప్యాలెస్‌ల‌ను కూలుస్తాం.. కానీ.. : చంద్ర‌బాబు స‌ర్కారు ఏమందంటే!

అయితే.. వైసీపీ స‌ర్కారు కుప్ప‌కూలి .. కూట‌మి ప్ర‌భుత్వం రావ‌డంతో ఈ వ్య‌వ‌హారాలు వెలుగు చూశాయి.

Update: 2024-06-27 03:43 GMT

ఏపీలో గ‌త వైసీపీ హ‌యాంలో జిల్లాకొక పార్టీ కార్యాల‌యం కట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల వీటికి సంబంధించిన వ్య‌వహారం మీడియాలో ప్ర‌ముఖంగా వెలుగు చూసింది. భారీ ఎత్తున ఆయా జిల్లాల్లో వైసీపీ కార్యాల‌యాల‌కు స్థ‌లాలు కేటాయించుకున్నారు. ఎక‌రానికి రూ.1000 చొప్పున లీజుకు తీసుకున్న ఈ స్థ‌లాల్లో ఇప్ప‌టికే ఇంద్రభ‌వ‌నాల‌ను త‌ల‌పించే వైసీపీ కార్యాల‌యా ల‌ను క‌ట్టుకున్నారు. కొన్ని ప్రారంభానికి రెడీ అయ్యాయి. మ‌రికొన్ని నిర్మాణ తుది ద‌శ‌లో ఉన్నాయి. అయితే.. వైసీపీ స‌ర్కారు కుప్ప‌కూలి .. కూట‌మి ప్ర‌భుత్వం రావ‌డంతో ఈ వ్య‌వ‌హారాలు వెలుగు చూశాయి.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాల్లో జిల్లాకు ఒక‌టి చొప్పున ఈ కార్యాల‌యాల‌ను అధునాత‌న సౌక‌ర్యాల‌తో నిర్మించారు. నిర్మిస్తున్నారు. ఈ భ‌వ‌నాల‌ను.. వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు అయోధ్య‌రామిరెడ్డిసొంత సంస్థ‌.. రాంకీ చేప‌ట్టింది. ఇది మ‌రొక వివాదం. ఇలా ఉంటే.. ఆయా భ‌వ‌నాల‌పై నిశితంగా దృష్టి పెట్టిన కూట‌మి ప్ర‌భుత్వం .. అనుమ‌తులు లేనివాటికి నిబంధ‌న‌ల ప్ర‌కారం నోటీసులు ఇచ్చింది. ఎందుకు కూల్చి వేయ‌రాదో స‌మాధానం చెప్పాల‌ని ప్ర‌శ్నించింది. దీంతో హ‌డ‌లెత్తిన వైసీపీ నాయ‌కులు.. వెంట‌నే ఈవిష‌యాన్ని హైకోర్టులో స‌వాల్ చేశారు.

''మా భ‌వ‌నాల‌ను కూల్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంది'' అంటూ తాజాగా బుధ‌వారం హైకోర్టులో వైసీపీ పిటిష‌న్ వేసింది. దీనిని అత్యవ స‌రంగా విచారించాల‌ని కోరింది. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు.. అస‌లు ఏం జ‌రిగింద‌ని ప్ర‌శ్నించింది. దీంతో ఇటు స‌ర్కారు, అటు వైసీపీ త‌ర‌ఫున న్యాయ‌వాదులు ఆయా వివ‌రాల‌ను కోర్టుకు ఇచ్చారు. అయితే.. చంద్ర‌బాబు స‌ర్కారు త‌ర‌ఫున న్యాయ‌వాది మాత్రం ''కూల్చేస్తాం.. కానీ, ఇప్పుడే కాదు'' అని కోర్టుకు తెలిపారు. ప్ర‌స్తుతం తాము నిబంధ‌న‌ల గురించి ప్ర‌శ్నించామ‌ని.. నిబంధ‌లు స‌రిగానే ఉంటే..తాము జోక్యం చేసుకునేది లేద‌ని.. కానీ, ప్లాన్‌, అనుమ‌తులు లేని, నిబంధ‌న‌లు ప‌ట్ట‌ని నిర్మాణాల‌ను మాత్రం కూల్చి వేసేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని హైకోర్టుకు విన్న‌వించారు. దీంతో కోర్టు కూడా.. ఇప్పుడు ఏమీ చేయ‌లేం అంటూ.. పేర్కొంది.

Tags:    

Similar News