మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌.. హైకోర్టు ఏం చెప్పిందంటే!

ఈ నేపథ్యంలో మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ను కొనసాగించాలని హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) ను హైకోర్టు కొట్టేసింది.

Update: 2024-03-14 04:27 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్‌ ను ఉమ్మడి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ గడువు జూన్‌ 2 నాటికి పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ను కొనసాగించాలని హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) ను హైకోర్టు కొట్టేసింది.

హైదరాబాద్‌ మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని.. ఈ మేరకు చట్టం తీసుకొచ్చేలా కేంద్ర హోం శాఖను ఆదేశించాలంటూ ఈ పిల్‌ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఈ పిల్‌ ను విచారించిన హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై చట్టం చేయాలని తాము పార్లమెంటును ఎలా ఆదేశించగలమని ప్రశ్నించింది. తమకు కొన్ని పరిమితులు ఉంటాయని స్పష్టం చేసింది. అందువల్ల ఆదేశాలివ్వడం పిల్‌ వేసినంత తేలిక కాదని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌ రావులతో కూడిన ధర్మాసనం ఆ పిల్‌ ను కొట్టేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ విభజన చట్టంలోని నిబంధనలను అనుసరించి రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అప్పులు, ఆస్తులు, కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తి కాలేదని పిటిషనర్‌ తన పిటిషన్‌ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్‌ కుమార్‌ హైకోర్టులో వేసిన పిల్‌ ను తాజాగా హైకోర్టు ధర్మాసనం విచారించింది.

ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది కౌశిక్‌ వాదనలు వినిపిస్తూ.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించి ఈ ఏడాది జూన్‌ 2తో పదేళ్లు పూర్తవుతుందని గుర్తు చేశారు. ఆస్తులు, అప్పుల విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్‌ ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై చట్టం చేసేలా తాము పార్లమెంటును ఏ విధంగా ఆదేశించగలమని ధర్మాసనం ప్రశ్నించింది. తమకు కొన్ని పరిమితులు ఉంటాయని.. వాటిని మీరబోమని వెల్లడించింది. అందువల్ల తాము కేంద్రానికి ఆదేశాలివ్వలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ ను కొట్టేసింది.

కాగా కొద్ది రోజుల క్రితం ఏపీలో అధికార వైసీపీ నేతలు హైదరాబాద్‌ ను ఉమ్మడి రాజధానిగా పదేళ్లు కొనసాగించాలని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, తదితరులు ఈ వాదన వినిపించారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

Tags:    

Similar News