భూ కేటాయింపు.. రాఘవేంద్ర రావుకు హైకోర్టు నోటీసులు!
దిగ్గజ సినీ దర్శకుడు కె. రాఘవేంద్ర రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
దిగ్గజ సినీ దర్శకుడు కె. రాఘవేంద్ర రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. భూ కేటాయింపు విషయంలో తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం ఈ నోటీసులు పంపడం సంచలనంగా మారింది. పాత కేసును ఇప్పుడు హైకోర్టు విచారణకు తీసుకోవడంతో రాఘవేంద్ర రావు న్యాయపరమైన ఇబ్బందుల్లో పడ్డారనే చెప్పాలి. బంజారాహిల్స్ షేక్ పేటలో రెండెకరాల భూ కేటాయింపుపై కె. రాఘవేంద్రరావు, కె. క్రిష్ణ మోహన్ తదితరులకు గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ భూ కేటాయింపును రద్దు చేయాలని కోరుతూ మెదక్ కు చెందిన బాలకిషన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్ ల ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షేక్ పేట్ లో రెండెకరాల భూమిని సినీ పరిశ్రమ డెవలప్ మెంట్ కోసం అప్పటి ప్రభుత్వం కేటాయించింది. కానీ ఈ భూమిని రాఘవేంద్ర రావు తదితరులు సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై బాలకిషన్ 2012లోనే పిల్ దాఖలు చేశారు. ఈ ఏడాది మార్చిలో ఈ పిల్ విచారణకు వచ్చింది. అప్పుడే రాఘవేంద్ర రావుకు హైకోర్టు నోటీసులు దాఖలు చేసింది. కానీ అవి ఆయనకు అందినట్లు రికార్డుల్లో లేకపోవడంతో మరోసారి నోటీసులు పంపించింది. ఈ కేసు విచారణను జనవరి 18కి వాయిదా వేసింది.
బంజారాహిల్స్ సర్వే నంబర్ 403/1లో 2 ఎకరాల భూమిని షరతులకు విరుద్ధంగా బార్ లు, పబ్ లు, థియేటర్లు తదితర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హై కోర్టు రాఘవేంద్రరావు సహా ఆయన బంధువులు క్రిష్ణమోహన్ రావు, చక్రవర్తి, విజయ లక్మి, అఖిలాండేశ్వరి, లాలస దేవికి నోటీసులు పంపించింది. ఇటీవల చంద్రబాబు అరెస్టు విషయాన్ని రాఘవేంద్రరావు తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.