పరామర్శకు వెళ్లిన హోంమంత్రిని గంటన్నరపాటు రోడ్డుపైన నిలబెట్టేశారు
ఏపీ అధికారపక్షంలోని అధిపత్యబపోరు.. ఆ పార్టీకి చెందిన ఒక యువకుడ్ని బలి తీసుకోవటం.. ఈ ఉదంతంతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత తీవ్ర నిరసనను ఎదుర్కొన్నారు
ఏపీ అధికారపక్షంలోని అధిపత్యబపోరు.. ఆ పార్టీకి చెందిన ఒక యువకుడ్ని బలి తీసుకోవటం.. ఈ ఉదంతంతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత తీవ్ర నిరసనను ఎదుర్కొన్నారు. సరైన సమయంలో సరైన రీతిలో స్పందించని కారణంగా లేని సమస్యల్ని తెచ్చి పెట్టుకున్న ఆమె.. ఈ ఇష్యూను సర్ది చెప్పేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు అనూహ్య పరిణామాలకు కారణమయ్యాయి. సొంత నియోజకవర్గంలో రాష్ట్రానికి హోం మంత్రిగా ఉన్న ఆమె.. పరామర్శ కోసం వెళితే.. గంటన్నర పాటు రోడ్డుపై నిలుచుకోవాల్సి వచ్చిన పరిస్థితి. అంతేకాదు.. ఆమెను అక్కడి ప్రజలు ఘోరవ్ చేయటంతో పాటు.. ముందుకు కదలనీయకుండా ఉంచేశారు. భారీ ఎత్తున పోలీసులసంరక్షణలో రోడ్డు మీద ఉండి.. తాను తీసుకొచ్చిన పరిహారం చెక్కుల్ని బాధితుడి కుటుంబానికి అందజేసి.. వారి ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం ఇస్తానన్న హామీని ఇచ్చిన తర్వాత వెనుదిరిగారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏపీ హోం మంత్రికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆమెను నిందిస్తున్న అక్కడి స్థానికులపై పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. తమ ఊరికి వచ్చి తమను అడ్డుకుంటారేంటి? అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల ఆరున దొమ్మేరు (తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం)లో గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం జరిగింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే కమ్ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోస్టర్ లో స్థానిక నాయకుల ఫోటోల్ని చించేసిన ఉదంతంలో మహేందర్ అన్న యువకుడు కారణమన్న అనుమానంతో అతడ్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి.. దారుణ హింసలకు గురి చేయటం.. అనంతరం అతడ్ని విడిచి పెట్టగా అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడటం.. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించటం తెలిసిందే.
దళిత సామాజిక వర్గానికి చెందిన మహేందర్ ఆత్మహత్యపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాధితుడి కుటుంబాన్ని పరామర్శించి.. వారికి పరిహారం ఇచ్చేందుకు హోంమంత్రి వనిత దొమ్మేరుకు వెళ్లారు. అక్కడి ప్రజలు అడ్డుకోవటంతో పాటుఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ కు మహేందర్ ను పిలిచినప్పుడు.. ఆమెకు ఫోన్ చేయగా.. పంపించేస్తారంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని.. ఫోన్ చేస్తే మహేందర్ ప్రాణాలు నిలిచేవంటూ అక్కడి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో మీ గెలుపు కోసం కష్టపడిన మాకు.. చావును బహుమానంగా ఇస్తారా? అంటూ ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహేంద్రను పోలీసులు అక్రమంగా నిర్బందించారని చెప్పినా స్పందించలేదని మండిపడ్డారు. పరామర్శలో భాగంగా భారీగా పోలీసుల బలగాల్ని తీసుకొచ్చిన ఆమె.. బాధితుడి కుటుంబాన్ని కలిసేందుకు ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకోవటంతో దాదాపు గంటన్నర పాటు రోడ్డు మీదనే ఉండిపోయారు. ప్రభుత్వం నుంచి పరిహారంగా రూ.10 లక్షల చెక్కు.. వైసీపీ నాయకుడి నుంచి రూ.10 లక్షల చెక్కును తీసుకొచ్చి వారికుటుంబానికి అందించేందుకు ప్రయత్నించి.. చివరకు అనుకున్నది సాధించారు.
మహేందర్ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి వెనుదిరిగారు. దాదాపు గంటన్నర పాటు రోడ్డు మీదనే ఉండిపోయిన హోంమంత్రి వనిత.. చివరకు పరామర్శను పూర్తి చేసుకున్న తర్వాత వెనుదిరిగారు. ఇందుకోసం స్థానికంగా ఆమెకు కొందరు సహకరించారు. హోంమంత్రి పరామర్శ నేపథ్యంలో వందల మంది పోలీసుల్ని దొమ్మేరులో మొహరించటంతో పాటు.. టీడీపీకి చెందిన పలువురిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిర్బంధిం చేశారు. దీనిపై పలువురు అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.