అంబానీల పెళ్లి కోసం 100 విమానాలు?
అంబానీల పెళ్లి సంబరాలు పీక్స్ కి చేరుకున్నాయి. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ జంట ఈనెల 12న పవిత్ర బంధంతో ఒకటి కానున్నారు.
అంబానీల పెళ్లి సంబరాలు పీక్స్ కి చేరుకున్నాయి. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ జంట ఈనెల 12న పవిత్ర బంధంతో ఒకటి కానున్నారు. ఏ నోట విన్నా ఈ పెళ్లి గురించే చర్చ. గుజరాత్ జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ ఉత్సవాల నుండి ఇటలీలోని విలాసవంతమైన క్రూయిజ్ షిప్ వేడుక వరకు ప్రతిదీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆసియాలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ తన రెండో కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి ఖర్చుకు వెనకాడకుండా వైభవంగా చేస్తున్నారు.
ఈ వేడుకలకు సెలబ్రిటీల్లో ఎ-లిస్టర్‌లు హాజరవుతున్నారు. వివాహ వేడుకకు అతిథులను తీసుకెళ్లేందుకు బిలియనీర్ అంబానీ మూడు ఫాల్కన్-2000 జెట్‌లను అద్దెకు తీసుకున్నట్లు ఇటీవల కథనాలొచ్చాయి.
వార్తా సంస్థ రాయిటర్స్ అందించిన వివరాల ప్రకారం... ఎయిర్ చార్టర్ కంపెనీ క్లబ్ వన్ ఎయిర్ CEO రాజన్ మెహ్రా మాట్లాడుతూ.. వివాహ అతిథులను తరలించడానికి అంబానీలు తమ మూడు ఫాల్కన్-2000 జెట్‌లను అద్దెకు తీసుకున్నారని.. వివాహ వేడుకల సమయంలో 100 ప్రైవేట్ విమానాలను ఉపయోగించాలని అడిగారని చెప్పారు. ``అతిథులు అన్ని ప్రాంతాల నుండి వస్తున్నారు.. ప్రతి విమానం దేశవ్యాప్తంగా అనేక పర్యటనలు చేస్తుంది`` అని మెహ్రా రాయిటర్స్‌తో అన్నారు.
అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ జూలై 12న వివాహం చేసుకోనున్నారు. ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ కూడా తన సతీమణితో అటెండవుతున్నారు. నేడు చరణ్ ముంబై వెళ్లారని కూడా కథనాలొచ్చాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు సహా చరణ్ ఈ వేదికపై ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. మార్చిలో జామ్‌నగర్ వేడుకలు సహ మేలో క్రూయిజ్ షిప్ వేడుకలతో అంబానీల పెళ్లి వేడుకలు పతాక స్థాయికి చేరుకున్నాయి. వేడుకలకు షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, జాన్హవి కపూర్, అనన్య పాండే, సారా అలీ ఖాన్, సహా దాదాపు ప్రతి బాలీవుడ్ సెలబ్రిటీ హాజరయ్యారు.
ముంబైలో ట్రాఫిక్ ఆంక్షలు:
ఇటీవల వివాహానికి ముందు సంగీత్ వేడుకలో పాప్ స్టార్ జస్టిన్ బీబర్ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గత వారం ముంబై ట్రాఫిక్ పోలీసులు అనంత్-రాధిక వివాహ ఉత్సవాల కారణంగా ప్రయాణికులకు ట్రాఫిక్ అడ్వైజరీ హెచ్చరికను విడుదల చేశారు. దీనిని పబ్లిక్ ఈవెంట్ అని వ్యాఖ్యానించారు. జులై 5న జూలై 12 నుండి 15 జూలై 2024 వరకు బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో పబ్లిక్ ఈవెంట్ కారణంగా, ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఈ క్రింది ట్రాఫిక్ ఏర్పాట్లు ఉంటాయి! అని ముంబై ట్రాఫిక్ పోలీసులు X లో రాశారు. అయితే ఇది ముంబైవాసులకు అంత నచ్చలేదు. అంబానీల వివాహ వేడుకలను పబ్లిక్ ఈవెంట్‌గా పిలిచినందుకు ముంబై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.