నివేదిక చెప్పిన నిజం: యూపీకి వరంగా అయోధ్య రామాలయం
2022లో యూపీ రాష్ట్రాన్ని మొత్తం 32 కోట్ల మంది సందర్శిస్తే.. అందులో అయోధ్యకు వచ్చిన యాత్రికుల సంఖ్య 2.21 కోట్ల మంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా.. మరెక్కడ విన్నా అయోధ్య రామాలయం గురించే చర్చంతా. 500 ఏళ్ల నాటి కల సాకారం అవుతున్న వేళ.. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేపట్టిన బాలరాముడి కార్యక్రమాన్ని కనులారా చూసేందుకు దేశ వాసులు తహతహ లాడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అయోధ్యలో నిర్మితమైన రామమందిరం కారణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు మారనున్నాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. దేశంలో టూరిజంలో అధ్యాత్మిక విహారయాత్రలే ఎక్కువన్న సంగతి తెలిసిందే.
ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ ఏడాదిలో ఒకట్రెండుసార్లు ఏదో ఒక పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవాలన్న ఆకాంక్ష కనిపించటమే కాదు.. కుటుంబం మొత్తం వెళ్లే పరిస్థితి. ఈ టూరిజం కారణంగా రవాణా మొదలుకొని హోటళ్లు.. రెస్టారెంట్లతో పాటు అన్ని రకాల వ్యాపారాలకు గిరాకీ ఉంటుంది. ఏడాదిలో 2 నెలలు ఉండే శబరిమల అయ్యప్ప సీజన్ కారణంగా కేరళలోని అయ్యప్ప ఆలయానికి వచ్చే ఆదాయం రూ.357 కోట్లు. ఆలయానికి వచ్చే ఆదాయమే అంత ఉంటే.. లక్షల్లో తరలి వచ్చే భక్తుల కారణంగా రాష్ట్రానికి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయం మరెంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన తర్వాత ఆధ్యాత్మికంగా పర్యాటకం మరింతగా పుంజుకుంటుందని ఎస్ బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. అయోధ్య రామాలయ నిర్మాణం.. ఇతర చర్యల కారణంగా 2024-25లో యూపీ సర్కారుకు అదనంగా రూ.25వేల కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చే యాత్రికుల కారణంగా అధిక మొత్తంలో ఆదాయం లభిస్తుందని చెబుతున్నారు. వీరి రాకపోకల కారణంగా రోడ్డు.. రైలు.. వాయు రవాణా అధికంగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
2022లో యూపీ రాష్ట్రాన్ని మొత్తం 32 కోట్ల మంది సందర్శిస్తే.. అందులో అయోధ్యకు వచ్చిన యాత్రికుల సంఖ్య 2.21 కోట్ల మంది. విదేశీ పర్యాటకుల్ని ఆకట్టుకోవటంలో యూపీ ఇప్పటికే ఐదో స్థానంలో ఉంది. రాష్ట్రానికి టూరిస్టుల కారణంగా వచ్చే ఆదాయం రూ.10,500 కోట్లు. 2027 నాటికి మహారాష్ట్ర.. ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కూడా 500 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించనుంది. దేశ జీడీపీలో దీని వాటా 10 శాతం కావటం గమనార్హం. 2027-28 నాటికి దేశ జీడీపీ వెయిటేజీలో ఉత్తరప్రదేశ్ కు రెండో స్థానం సాధించే వీలుందని అంచనా వేస్తున్నారు.
అప్పటికి నార్వే జీడీపీని అప్పటి యూపీ అధిగమిస్తుందన్న అంచనా ఆసక్తికరంగా మారింది. అయోధ్యలోని పర్యాటకుల కోసం హోటళ్లు.. గెస్టు హౌస్ ల నిర్మాణం ఎక్కువ అవుతోంది. ప్రధాన ఆలయానికి 5-10కి.మీ. దూరంలో గజం రూ.2 లక్షల వరకు పలకటమే దీనికి నిదర్శనం. రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరుగుతుందని చెబుతున్నారు.