పవన్ కి భారీ మెజారిటీ... బాధ్యత వర్మదే...!

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ తాజాగా భేటీ అయి కీలక చర్చలు జరిపారు.

Update: 2024-03-24 15:51 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇపుడు టీడీపీ మీద పడింది. దాంతో టీడీపీ ఆయన వద్దకు తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను పంపిస్తూ ఎన్నికల వ్యూహాలను రచిస్తోంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ తాజాగా భేటీ అయి కీలక చర్చలు జరిపారు.

ఈ చర్చలలో మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు కూడా పాలుపంచుకున్నారు. తన దగ్గరకు వచ్చిన వర్మను పవన్ సత్కరించారు. అనంతరం వీరు పిఠాపురం ఎన్నికల గురించి చర్చలు జరిపారు. పిఠాపురంలో ప్రస్తుతం ఉన పరిస్థితులు పరిణామాలు వర్మ పవన్ కి వివరించారు.

ఏ విధంగా ఎన్నికల వ్యూహం రూపొందించాలన్నది కూడ వారు చర్చించారు అని సమాచారం. అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ పవన్ ని పిఠాపురంలో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకుని వస్తామని చెప్పారు. పిఠాపురం లో వార్ వన్ సైడ్ అని కూడా అంటున్నారు.

మరో వైపు చూస్తే వర్మ మీదనే ఇపుడు టీడీపీ ముఖ్య బాధ్యతలు పెట్టినట్లుగా తెలిసింది. వర్మ 2014లోనే 47 వెల పై చిలుకు మెజారిటీ ఓట్లు సాధించారు. ఆయన అక్కడ బలమైన అభ్యర్ధిగా ఉన్నారు. ఆయనకు పిఠాపురంలో అణువణువూ తెలుసు. వరసగా మూడు ఎన్నికలలో ఆయన పోటీ చేసి ఉన్నారు.

పిఠాపురంలో ఏ ప్యాకెట్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏవి ఎలా కలిసి వస్తాయన్నది ఆయనకు పక్కాగా తెలుసు. దాంతో వర్మ పవన్ గెలుపు బాధ్యతలను తన మీదనే పూర్తిగా వేసుకున్నారు అని అంటున్నారు. వాస్తవానికి చూస్తే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఎస్వీఎస్ఎన్ వర్మ భావించారు. కానీ, పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం జనసేనకు కేటాయించారు.

ఇక అక్కడ్నించి బరిలో దిగుతున్నట్టు పవన్ ప్రకటించగా ఆ ప్రకటన తరువాత వర్మ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఆ మీదట టీడీపీ అధినేత చంద్రబాబు నచ్చచెప్పడంతో వర్మ శాంతించారు. ఈ నేపథ్యంలో పవన్ తో నేడు వర్మ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవన్నీ ఇలా ఉంచితే పవన్ కి పిఠాపురంలో లక్ష ఓట్లకు తగ్గకుండా మెజారిటీ వస్తుందని పిఠాపురం జనసేన ఇంచార్జి ఉదయ్ శ్రీనివాస్ చెబుతున్నారు. ముగ్గురు సీనియర్లను వైసీపీ రంగంలోకి ఇప్పటికే దింపిందని అయితే ముగ్గురు కాదు మూడు వేల మంది వచ్చినా లక్ష మెజారిటీ పవన్ కి రాకుండా ఎవరూ ఆపలేరని అంటున్నారు. మొత్తానికి పిఠాపురంలో అంతా పవన్ కి సానుకూలం అవుతోంది అని అంటున్నారు

Tags:    

Similar News