15 ఏళ్ల జైలు.. 80 కోట్ల ఫైన్.. అందుకే బైడెన్ కు బైబై..

కానీ, తెరవెనుక లోతుగా చూస్తే వేరే అంశాన్ని కూడా చూపుతున్నారు.

Update: 2024-09-06 09:44 GMT

ఇప్పటికే అనేక సంచలనాలకు వేదికైన అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో సంచలన విషయం బయటపడింది.. ఓవైపు మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు.. మరోవైపు మళ్లీ పోటీకి దిగిన అధ్యక్షుడు జో బైడెన్.. చివరకు అనారోగ్యంతో తప్పుకోక తప్పని పరిస్థితి. ఇంకోవైపు అధ్యక్ష అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు, భారత మూలాలున్న కమలా హారిస్ ఖరారు.. అయితే, కమలా తెరపైకి రావడానికి మూల కారణం బైడెన్ అనారోగ్యంగా ఇప్పటివరకు భావించారు. కానీ, తెరవెనుక లోతుగా చూస్తే వేరే అంశాన్ని కూడా చూపుతున్నారు. ఇది ఆయన పార్టీ డెమోక్రాట్లకు శరాఘాతమే అంటున్నారు.

హంటర్.. ట్యాక్స్ జంపర్

బైడెన్ కుమారుడి పేరు హంటర్. ఇప్పుడు ఇతడే వివాదాలకు కేంద్రంగా మారాడు. హంటర్ పన్ను ఎగవేత కేసుల్లో ఉన్న అతడు నేరాన్ని అంగీకరించాడు. కోర్టులో లొంగిపోయాడు. పన్ను ఎగవేత, రిటర్న్‌ లను సక్రమంగా దాఖలు చేయకపోవడం సహా తొమ్మిది కేసుల్లో తనపై వచ్చిన నేరాలను ఒప్పుకొంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఇదంతా బైడెన్ అధికారంలో లేనప్పుడే జరిగింది. 2016-19 మధ్య ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హంటర్ ఏకంగా 1.4 మిలియన్ డాలర్ల మేర పన్ను ఎగ్గొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. తప్పుడు డాక్యమెంట్లను సమర్పించారనే కథనాలు రాగా.. హంటర్ తోసిపుచ్చారు. అయితే, ఈ ఆర్థిక నేరాలపై లాస్ ఏంజిలిస్‌ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదైంది. 9 పిటిషన్లు దాఖలవగా వాటిపై గురువారం విచారణ మొదలైంది. 56 పేజీల తొలి పిటిషన్‌ ను చదవడం పూర్తయిన వెంటనే.. హంటర్ తరఫు న్యాయవాది తమ క్లయింట్ నేరాంగీకరణ పిటిషన్‌ ను సమర్పించారు.

దశాబ్దన్నర జైలు ఖాయం

అమెరికా చట్టాల ప్రకారం.. పన్ను ఎగవేత పెద్ద నేరం. ఇందుకు గాను హంటర్ కు 15 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. మిలియన్ డాలర్ల జరిమానా కూడా. మరోవైపు ఇప్పుడు ఆయన నేరాంగీకారంతో.. ఐటీ రిటర్న్స్ దాఖలు విషయంలో ఎలాంటి పొరపాట్లూ చేయలేదంటూ నిరుడు కోర్టుకు సమర్పించిన నివేదిక చెల్లకుండా పోయింది. కాగా, అధ్యక్ష ఎన్నికలు సరిగ్గా రెండు నెలల్లో (నవంబరు 5న) జరుగనున్నాయి. డెమోక్రాట్లు, రిపబ్లికన్ అభ్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటప్పుడు హంటర్ బైడెన్ ఉదంతం.. డెమొక్రాట్లను ఇబ్బందుల్లో పడేయడం ఖాయమని చెబుతున్నారు. ఇవన్నీ ఊహించే బైడెన్ ను డెమోక్రాట్ అభ్యర్థిగా తప్పించారని తెలుస్తోంది.

Tags:    

Similar News