బాలీవుడ్ మూవీ మాదిరి.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త

ఈ సందర్భంగా తన భార్య ప్రేమ ఉదంతాన్ని భర్త తెలుసుకున్నాడు. దీని మీద పెద్ద వివాదం చేయాలనుకోలేదు.

Update: 2023-09-25 04:26 GMT

రీల్ కు ఏ మాత్రం తీసిపోని రియల్ ఉదంతాలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా వెలుగు చూసిన వైనం కూడా ఆ కోవకు చెందిందే. బాలీవుడ్ సినిమా మాదిరి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం సంచలనంగా మారింది. పెళ్లికి ముందు భార్య ప్రేమించిన వ్యక్తిని.. ఆమె ఎంతకూ మర్చిపోలేకపోతున్న వేళ.. ఆమెను కలిసేందుకు వచ్చిన ప్రియుడితో మాట్లాడి.. భార్య తరఫు వారితో మాట్లాడి వారందరి అంగీకారంతో భార్య పెళ్లి చేసిన భర్త ఉదంతమిది. సినిమాటిక్ గా ఉండే ఈ వ్యవహారంలోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ లోని డియోరియా జిల్లాలో ఒక జంటకు ఏడాది క్రితం పెళ్లి జరిగింది. అయితే.. పెళ్లికి ముందు భార్యకు రెండేళ్లుగా ఒక వ్యక్తితో ప్రేమలో ఉందన్న విషయం తెలీదు. అయితే.. పెళ్లికి ముందు బిహార్ కు చెందిన ఆకాష్ షా తన ప్రియురాల్ని ఎంతకూ మర్చిపోలేకపోతున్నాడు. ఆమెకు పెళ్లైనప్పటికీ.. ఆమె విడిచి వెళ్లలేని పరిస్థితి. దీంతో.. ఆమెను కలిసేందుకు పెళ్లైన ఏడాది తర్వాత యూపీలోని ఆమె ఉండే ఊరికి వెళ్లాడు.

అతగాడు వెళ్లేసరికి రాత్రి అయ్యింది. బైక్ మీద వెళ్లిన అతను.. జంకు లేకుండా తన ప్రియురాలు నివాసం ఉండే అత్తగారింటికి వెళ్లాడు. అంత రాత్రి వేళ ఆమెను కలిశాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అతడ్ని అదుపులోకి తీసుకొని కొట్టారు.

ఈ సందర్భంగా తన భార్య ప్రేమ ఉదంతాన్ని భర్త తెలుసుకున్నాడు. దీని మీద పెద్ద వివాదం చేయాలనుకోలేదు. దీనికి తోడు.. భార్య తన ప్రియుడితో వెళతానని భర్తను బ్రతిమిలాడటం తో అతను అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నాడు.

భార్య తరఫు కుటుంబ సభ్యులతో మాట్లాడిన భర్త.. విషయం మొత్తం చెప్పి.. తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేయాలనుకున్న విషయాన్ని వెల్లడించాడు. వారి అనుమతి తీసుకొని.. భార్యను.. ఆమె ప్రియుడ్ని తీసుకొని స్థానికంగా ఉండే గుడికి తీసుకెళ్లాడు.

అక్కడ వారిద్దరికి పెళ్లి చేశాడు. బైక్ మీద ఒక్కడిగా వచ్చిన ప్రియుడు.. పెళ్లి అనంతరం భార్యను తీసుకొని వెళ్లిపోయాడు. భార్య ప్రియుడితో పెళ్లి చేసిన భర్త ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది. రీల్ కు ఏ మాత్రం తీసిపోని ఈ రియల్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.

Tags:    

Similar News