హైదరాబాదీలకు ఎంత ముందుచూపుఅన్నది చెప్పిన నివేదిక

హైదరాబాదీయుల ముందుచూపు ఎంత ఎక్కువన్న విషయాన్ని వెల్లడించింది తాజాగా విడుదలైన ఒక నివేదిక.

Update: 2024-09-05 12:30 GMT

హైదరాబాదీయుల ముందుచూపు ఎంత ఎక్కువన్న విషయాన్ని వెల్లడించింది తాజాగా విడుదలైన ఒక నివేదిక. ఆర్థిక అనిశ్చితికి ముందస్తు ప్లానింగ్ లో హైదరాబాద్ వాసులు ముందుంటారని.. ఐదేళ్ల తర్వాత ఎదురయ్యే సవాళ్లకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నతీరును ఈ రిపోర్టు వెల్లడించింది. తమ భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు వీలైన ప్లానింగ్ చేసుకుంటున్న విషయాన్ని ఇందులో పేర్కొన్నారు.

జాతీయస్థాయిలో ఈ ప్లానింగ్ 34 శాతంగా ఉంటే.. హైదరాబాదీయుల్లో మాత్రం చాలా ఎక్కువగా ఉన్నట్లు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ అనిశ్చిత్ ఇండెక్స్ 2024 పేర్కొంది. వచ్చే ఐదేళ్ల కాలంలో గణనీయమైన స్థాయిలో ఆర్థిక అనిశ్చితులు తలెత్తే అవకాశం ఉందని హైదరాబాదీయులు భావిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు సిద్ధంగా ఉండేలా 95 శాతం హైదరాబాదీయులు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా నిపుణుల సలహాల్ని తీసుకుంటున్నట్లు రిపోర్టు వెల్లడించింది.

రిపోర్టులో పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనది.. భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక కష్టాల నుంచి కుటుంబానికి అండగా ఉండేందుకు వీలుగా 83 శాతం మంది బీమా పాలసీలు తీసుకున్నారని.. మ్యూచువల్ ఫండ్లు.. షేర్లలో పది శాతం మంది పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. సంప్రదాయ పెట్టుబడులైన ఫిక్స్ డ్ డిపాజిట్లు లాంటి వాటిల్లో 48 శాతం మంది పొదుపు చేస్తుంటే.. 52 శాతం మంది పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటిస్తున్నట్లు పేర్కొన్నారు.

స్థిరమైన పింఛన్ వచ్చేలా ఉద్యోగాలు.. పెరుగుతున్న వ్యాపారాలతో హైదరాబాద్ లో 51 శాతం మంది భవిష్యత్ మీద ధీమాతో ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవటానికి వీలుగా 69 శాతం మంది పొదుపు ఖాతాల్లో డబ్బుల్ని సేవ్ చేసుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది. 68 శాతం మందికి జీవిత బీమా.. 54 శాతం మందికి హెల్త్ బీమా పాలసీలు ఉన్నాయి. 30 శాతం మంది రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీంలలో పెట్టుబడులు పెడుతున్నట్లుగా వెల్లడైంది.

Tags:    

Similar News