సంక్రాంతి నుంచి హైదరాబాద్ లో అన్నీ పండుగలే..

తెలుగు రాష్ట్రాలకు గర్వ కారణమైన నగరం ఏదంటే ఇప్పటికీ హైదరాబాద్ పేరే వినిపిస్తుంది.

Update: 2024-01-11 11:26 GMT

తెలుగు రాష్ట్రాలకు గర్వ కారణమైన నగరం ఏదంటే ఇప్పటికీ హైదరాబాద్ పేరే వినిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతున్నప్పటికీ మరో నగరం ఏదీ ఈ స్థాయిలో ఎదగలేదు. 430 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ కు మరో ప్రదేశం సాటిరాగలదనుకోడం సరికాదు కూడా. తెలుగు ప్రజలు ఎక్కువగా మెచ్చుకునేది మాత్రం హైదరాబాద్ అనే చెప్పాలి. ఇన్ఫర్మేషన్ బయో టెక్నాలజీతో వచ్చిన ఉద్యోగాలు.. పెరిగిన ఉపాధి అవకాశాలు.. రాజధాని నగరాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. 20 ఏళ్ల కిందట బెంగళూరుకు భాగ్యనగరానికి చాలా వ్యత్యాసం ఉండేది. ఇప్పడు ఆ నగరాన్ని ఢీకొడుతోంది.

సంక్రాతికి ఊరెళ్తుంది..

భాగ్య నగరం హైదరాబాద్ సంక్రాతి పండుగ నాడు బోసిపోతుంది. సీమాంధ్ర ప్రజలు అత్యధిక శాతం స్వగ్రామాలకు వెళ్లడమే దీనికి కారణం. సీమాంధ్రులే కాదు.. తెలంగాణ ప్రజలు కూడా పండుగకు ఊళ్లకు వెళ్తుంటారు. హైదరాబాద్ ను ఒక రౌండ్ వేసేయాలి అనుకునేవారికి ఇది సరైన సమయం అనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. ట్రాఫిక్ ఉండదు కాబట్టి. కాగా, సంక్రాతికి హైదరాబాద్ లో జరిగే సంబరాల్లో చెప్పుకోదగ్గది కైట్ ఫెస్టివల్ (పతంగుల పండుగ). సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే కైట్ ఫెస్టివల్ కు.. అంతర్జాతీయ స్థాయిలొ పేరుంది. తుర్కియే సహా వివిధ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు. ఈ నెల 13 శనివారం నుంచి మూడు రోజుల పాటు కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో 16 దేశాలకు చెందిన 40 మంది, మన దేశం నుంచి 60 మంది జాతీయ పతంగుల క్లబ్ సభ్యులు పాలుపంచుకుంటారు. మూడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ పండుగ కోసం పర్యాటక శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. కైట్ ఫెస్టివల్‌ తో పాటు స్వీట్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వీట్ ఫెస్టివల్‌ లో జాతీయ, అంతర్జాతీయ మిఠాయిలు అందుబాటులో ఉంచుతారు. దీంతోపాటు హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. సందర్శకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి.

ఎయిర్ షో.. టెస్టు క్రికెట్..

పౌర విమానయాన శాఖ, భారతీయ పరిశ్రమలు, తెలంగాణ ప్రభుత్వం, వాణిజ్య మండలి (ఫిక్కీ) ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 21 వరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఎయిర్ షో జరగనుంది. వింగ్స్ ఇండియా-2024 పేరిట నిర్వహించనున్న ఈ షోకు చివరి రెండు రోజుల్లో లక్ష మంది సందర్శకులు హాజరవుతారని అంచనా. ఇక హైదరాబాద్ ప్రతిష్ఠాత్మకమైన ఉప్పల్ మైదానంలో చాల కాలం తర్వాత టెస్టు మ్యాచ్ జరగనుంది. అందులోనూ టెస్టు క్రికెట్ ను వన్డేల తరహాలో ఆడే ఇంగ్లండ్ తో ఈ మ్యాచ్ జరగనుంది. దీనికోసం తెలంగాణలో గుర్తింపు పొందిన 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ కల్పించారు.

బుక్ ఫెయిర్.. నుమాయిష్..

జనవరి 1 నుంచి 45 రోజుల పాటు సాగే నుమాయిష్ ఏటా ప్రత్యేకం. వాస్తవానికి ఈ ప్రదర్శనకు సంక్రాంతి తర్వాతే రద్దీ ఉంటుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే నుమాయిష్ కు పండుగ తర్వాత ప్రజలు ఉత్సాహంగా గడిపేందుకు వస్తారు. కాగా, ఫిబ్రవరి 9 నుంచి హైదరాబాద్ లో 36వ నేషనల్ పుస్తక ప్రదర్శన (బుక్ ఫెయిర్) జరగనుంది. ఇందిరా పార్క్ వద్దనున్న ఎన్టీఆర్ స్టేడియం బుక్ ఫెయిర్ కు వేదిక కానుంది. మొత్తానికి నగర ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వారికి హైదరాబాద్ లో పండుగలు ఆహ్వానం పలకనున్నాయన్నమాట.

Tags:    

Similar News