తరుముకొస్తున్న బెంజీన్ భూతం!
ఇక 15 ఏళ్లకు మించిన వాహనాలు పెద్ద ఎత్తున నగరంలో ఉన్నాయి. ఇవన్నీ తిరుగుతుండటంతో హైదరాబాద్ పొగబారుతోంది
గ్రేటర్ హైదరాబాద్ కు కొత్త కష్టం మొదలవుతోంది. బెంజీన్ భూతం నిదానంగా తన జడలు విప్పుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా 25 వేల కొత్త వాహనాలు హైదరాబాద్ నగరంలో రోడ్లు ఎక్కుతున్నాయని అంచనా.
ఇక 15 ఏళ్లకు మించిన వాహనాలు పెద్ద ఎత్తున నగరంలో ఉన్నాయి. ఇవన్నీ తిరుగుతుండటంతో హైదరాబాద్ పొగబారుతోంది. పెట్రోలు, డీజిల్ వంటి పెట్రో ఉత్పత్తులు విచక్షణారహితంగా వాడటంతో బెంజీన్ తన పడగ విప్పుతోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణంలో బెంజీన్ మూలకం మోతాదును మించి ఉందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఘనపు మీటర్ గాలిలో బెంజీన్ 5 మైక్రోగ్రాములు దాటకూడదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ప్రాంతంలో గతేడాది డిసెంబర్‌లో బెంజీన్ ఏకంగా 7.95కు చేరింది. అలాగే పాశమైలారంలో గతేడాది మేలో 10.25, జూపార్కు వద్ద ఫిబ్రవరిలో 6.73, మార్చిలో 5.72, మేలో 5.17గా నమోదైందని కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఈ మేరకు పీసీబీ తన వార్షిక నివేదికలో పేర్కొంది.
ఈ నేపథ్యంలో వాతావరణంలో బెంజీన్ మూలకం మోతాదు దాటితే అనర్థమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెంజీన్ అతి త్వరగా గాలిలో ఆవిరిగా మారుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా దీనికి మండే స్వభావమూ అధికమేనంటున్నారు. ఈ మూలకం విచ్ఛిన్నమవడానికి 10 నుంచి 30 ఏళ్లు పడుతుందని వివరిస్తున్నారు. అంటే.. వాతావరణంలో సుదీర్ఘకాలం బెంజీన్ తిష్ట వేస్తుంది.
బెంజీన్ గాలి ప్రవాహం ద్వారా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు కూడా తరలివెళ్తుంది. దీని ప్రభావం అధికంగా ఉన్నచోట క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వంటి వ్యాధులు సంభవిస్తాయని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెల్లడించారు.
పెట్రోలు, డీజిల్ వంటి పెట్రో ఉత్పత్తులే కాకుండా ప్లాస్టిక్, డిటర్జెంట్, క్రిమిసంహారకాలు, రబ్బరు, బల్క్ డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వాయువుల్లోనూ బెంజీన్ మోతాదు ఎక్కువగానే ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పారిశ్రామికవాడల్లో వివిధ పరిశ్రమల నుంచి విడుదల అవుతున్న వాయువుల్లో బెంజీన్ కూడా ఉందని అంటున్నారు. ఇందుకు నిదర్శనంగా పాశమైలారంలో దాని పరిమాణం 10.25గా నమోదు కావడాన్ని చూపిస్తున్నారు.