హైడ్రాకు తిరుగులేని అధికారాలు.. అదెంత పవర్ ఫుల్ అంటే?
తాజాగా జరిగిన మత్రివర్గ సమావేశంలో హైడ్రా కోరలు మరింత పదునెక్కేలా చర్యలు తీసుకోవటమే కాదు.. దీనికి సంబంధించిన మరిన్ని అధికారాల్ని దఖలు పర్చటమే కాదు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానసపుత్రిక హైడ్రాకు సర్వాధికారాలు కట్టబెట్టేశారు. తాజాగా జరిగిన మత్రివర్గ సమావేశంలో హైడ్రా కోరలు మరింత పదునెక్కేలా చర్యలు తీసుకోవటమే కాదు.. దీనికి సంబంధించిన మరిన్ని అధికారాల్ని దఖలు పర్చటమే కాదు.. చట్టబద్ధతను కల్పించేలా చర్యలు తీసుకోవటం తాజా పరిణామం. అవుటర్ రింగు రోడ్డు లోపల ఉన్న చెరువులు.. కుంటలు.. నాలాలతో పాటు వాటి ఎఫ్ టీఎల్.. బఫర్ జోన్ల పరిరక్షణ.. అధికారాలన్నీ హైడ్రాకే అప్పజెప్పారు.
అంతేకాదు.. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి డిప్యుటేషన్ మీద 169 మంది అధికారులు.. 940 మంది పొరుగుసేవల సిబ్బందిని హైడ్రాలో నియమించేందుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర కాబినెట్ నిర్ణం తీసుకుంది. ఇతర శాఖల మాదిరి హైడ్రాకు ఉన్న అధికారాల్లో పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో మున్సిపాలిటీలు.. వివిధ శాఖలకు సంబంధించిన అన్ని అంశాలను హైడ్రాకు అప్పగిస్తూ.. ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 అర్బన్ స్థానిక సంస్థలతో పాటు.. ఇటీవల గ్రేటర్ లో చేర్చిన 51 పంచాయితీలను దీని పరిధిలోకి తీసుకువస్తున్నారు.
దాదాపు మూడు గంటల పాటు సాగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో వివిధ అంశాల్ని చర్చించారు. హైడ్రాకు అధిక ప్రాధాన్యతను కల్పించారు. వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కీలక అధికారాల్ని హైడ్రాకు దఖలు పర్చిన వైనం ఆసక్తికరంగా మారింది. దీంతో హైడ్రా సూపర్ పవర్ గా మారిందని చెప్పాలి. దీని కోరలు పదునెక్కటమే కాదు.. చెరువుల బఫర్ ల్యాండ్ ను.. ఎఫ్ టీఎల్ లలో చేపట్టే నిర్మాణల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు అవకాశం ఇవ్వనున్నారు.