మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? మిస్ కావొద్దు
ప్రెటోల్ బంకుల్లో ఫ్యూయల్ కొనుగోలుపై విధించే సర్ ఛార్జి రద్దు ఇకపై నెలకు రూ.50 వేల వరకు మాత్రమే వర్తిస్తున్నట్లుగా పేర్కొంది.
రోజులు గడుస్తున్న కొద్దీ సేవలు మరింత పెరగటంతో పాటు.. వినియోగదారుల మీద భారాన్ని తగ్గించేలా ప్లాన్ చేయాలి కంపెనీలు ఏవైనా. అందుకు భిన్నంగా దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ తీసుకున్న తాజా నిర్ణయం ఆ బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డు వాడే వారికి కల్పించే సదుపాయాల్లో కోత పెట్టింది. క్రెడిట్ కార్డును వినియోగించే వేళలో ఇచ్చే రివార్డు పాయింట్లలో కోత పెట్టిన ఈ బ్యాంక్.. కొత్త మార్గదర్శకాల్ని వచ్చే నెల (నవంబరు) 15 నుంచి కొత్త మార్పులు అమల్లోకి వస్తాయని పేర్కొంది.
క్రెడిట్ కార్డు లావాదేవీలపై లభించే రివార్డు పాయింట్లలో కోతతో పాటు.. గ్రాసరీ కొనుగోళ్లు.. ఎయిర్ పోర్టు లంజ్ యాక్సెస్.. ఫ్యూయ్ సర్ ఛార్జి రద్దు.. ఆలస్యంగా చెల్లింపులు జరిగే వారి విషయంలో పలు మార్పులు చేసింది. వచ్చే నెలలో అమల్లోకి వచ్చే ఈ కొత్త నిబంధనల్ని తన వినియోగదారులకు మెసేజ్ రూపంలో సమాచారాన్ని అందిస్తోంది. కొత్త మార్పుల్ని చూస్తే.. యుటిలిటీ.. బీమా చెల్లింపులపై కొత్తగా ఐసీఐసీఐ బ్యాంక్ పరిమితిని తీసుకొచ్చింది. ప్రీమియం కార్డు హోల్డర్లకు రూ.80వేల వరకు.. సాధారణ కార్డు హోల్డర్లకు రూ.40వేలు వరకు మాత్రమే రివార్డుల్ని అందించనున్నట్లు పేర్కొంది.
ప్రెటోల్ బంకుల్లో ఫ్యూయల్ కొనుగోలుపై విధించే సర్ ఛార్జి రద్దు ఇకపై నెలకు రూ.50 వేల వరకు మాత్రమే వర్తిస్తున్నట్లుగా పేర్కొంది. ఆ తర్వాతి కొనుగోళ్లపై సర్ ఛార్జిని చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క ఐసీఐసీఐ బ్యాంక్ ఎమరాల్డ్ మాస్టర్ కార్డ్ మెటల్ కార్డుపై మాత్రమే ఈ పరిమితిని రూ.లక్ష వరకు ఉండేలా చేసింది. గ్రాసరీ.. డిపార్ట్ మెంటల్ స్టోర్ లలో చేసే ఖర్చులపైనా రివార్డులపైనా కొన్ని కార్డులపై రూ.40వేలు.. మరికొన్ని కార్డులపై రూ.20వేల వరకు మాత్రమే రివార్డులు చెల్లిస్తామని ఐసీఐసీఊ చెబుతోంది.
క్రెడిట్ కార్డును ఉపయోగించి స్కూళ్లు.. కాలేజీల్లో చేసే పేమెంట్లపై తర్వాతి రోజుల్లోనూ ఎలాంటి ఫీజ్ ఉండదు అయితే.. థర్డ్ పార్టీ ఉపయోగించి చేసే చెల్లింపులపై మాత్రం ఒక శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఫీజు మినహాయింపు.. మైల్ స్టోన్ ప్రయోజనాలు పొందేందుకు విధించిన పరిమితి నుంచి అద్దె చెల్లింపులు.. ప్రభుత్వ చెల్లింపులు.. ఎడ్యుకేషన్ చెల్లింపుల్ని మినహాయిస్తామని చెబుతోంది. యాడ్ ఆన్ కార్డుపై వార్షిక ఫీజు ఇకపై రూ.199 వసూలు చేస్తారు.
మూడు నెలల వ్యవధి (ఒక త్రైమాసికంలో) రూ.75 వేలు అంతకంటే ఎక్కువ వినియోగించిన వారికే తర్వాతి నెలలో లాంజ్ యాక్సెస్ సదుపాయాన్ని కల్పిస్తారు. లేట్ ఫీజు విధానాన్ని సవరించింది. రూ.100 వరకు బకాయికి ఎలాంటి చెల్లింపులు లేవన్న బ్యాంక్ రూ.100 - రూ.500 బకాయి ఉంటే రూ.100, రూ.501 - 1000 వరకు బకాయికి రూ.500 చొప్పున వసూలు చేస్తారు. అదే రూ.5001 నుంచి రూ.10 వేల వరకు ఆలస్యంగా చెల్లింపులు జరిపితే రూ.750, రూ.10వేల నుంచి రూ.25వేల ఆలస్య బకాయి చెల్లింపుపై రూ.900.. రూ.50వేలకు పైనే చెల్లింపు బకాయిపై రూ.1300 చెల్లించాల్సి ఉంటుంది. సో.. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు చెల్లింపులు జరిపే వారు జర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.