ఐఐటీనా మజాకా... రూ. 3.7 కోట్ల ప్యాకేజ్!

అవును... ఈ ఏడాది ఐఐటీ బాంబే కు చెందిన ఇద్దరు విద్యార్థులకు భారీ ఆఫర్లు వచ్చాయని ప్రకటన వెలువడింది

Update: 2023-09-19 16:30 GMT

ప్లేస్ మెంట్లూ, ప్యాకేజీల విషయంలో ప్రతీ ఏటా ఐఐటీ లు రికార్డ్ సృష్టిస్తూనే ఉంటాయి. ఐఐటీ నుంచి బయటకు వెళ్తున్న విద్యార్థులు కోట్లలో వార్షిక వేతనాలు అందుకుంటున్నారు. విదేశీ కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి .ఈ క్రమంలో తాజాగా తమ విద్యార్థుల్లో ఒకరికి ఈ ఏడాది రూ.3.7 కోట్ల ప్యాకేజీ లభించినట్లు ఐఐటీ బాంబే ఓ ప్రకటనలో వెల్లడించింది.

అవును... ఈ ఏడాది ఐఐటీ బాంబే కు చెందిన ఇద్దరు విద్యార్థులకు భారీ ఆఫర్లు వచ్చాయని ప్రకటన వెలువడింది. ఇందులో భాగంగా ఓ విదేశీ కంపెనీ రూ.3.7 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీ ఆఫర్ చేసింది. ఇదే సమయంలో మరో విద్యార్థికి ఓ దేశీయ కంపెనీ రూ.1.7 కోట్ల ప్యాకేజీని ఆఫర్‌ చేసినట్లు చెప్పింది. అయితే వారి పేర్లు మాత్రం వెల్లడిపరచలేదు.

ఇక, 2022-23 ప్రీ ప్లేస్‌ మెంట్లలో మొత్తం 300 ఆఫర్లు రాగా.. 194 మంది వాటిని అంగీకరించారని వెల్లడించిన ఐఐటీ బాంబే... వీరిలో 16 మందికి రూ.కోటికి పైగా ప్యాకేజీ లభించినట్లు తెలిపింది. ఇదే క్రమంలో జులై 2022 నుంచి జూన్‌ 2023 వరకు జరిగిన ప్లేస్‌ మెంట్లకు మొత్తం 2,174 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నట్లు తెలిపింది.

వీరిలో దాదాపు 65 మందికి విదేశాల్లో ఆఫర్లు వచ్చినట్లు వెల్లడించింది. వీటిలో ప్రధానంగా అమెరికా, జపాన్‌, యూకే, హాంకాంగ్‌, నెదర్లాండ్స్‌, తైవాన్‌ లోని అంతర్జాతీయ కంపెనీల్లో తమ విద్యార్థులకు ఉద్యోగాలు లభించినట్లు వెల్లడించిన ఐఐటీ బాంబే... ఈసారి యావరేజ్ శాలరీ ప్యాకేజ్ రూ.21.82 లక్షలుగా నమోదైనట్లు తెలిపింది.

ఇక క్రితం ఏడాదితో పోలిస్తే ఐటీ, సాఫ్ట్‌ వేర్‌ విభాగాల్లో తక్కువ మందిని కంపెనీలు నియమించుకున్నట్లు పేర్కొన్న ఐఐటీ బాంబే... 302 మంది ఈ విభాగానికి చెందిన కంపెనీల్లో ఉద్యోగాలు పొందినట్లు తెలిపింది. ట్రేడింగ్‌, ఫైనాన్స్‌, ఫిన్‌ టెక్‌ కంపెనీలు అత్యధికంగా సాఫ్ట్‌ వేర్‌ విద్యార్థులను నియమించుకున్నట్లు పేర్కొంది.

కాగా... క్రితం ఏడాది సగటు వేతన ప్యాకేజ్ రూ.21.50లక్షలుగా ఉండగా.. అంతకు ముందు సంవత్సరం సగటున రూ.17.91 లక్షలుగా ఉంది.

Tags:    

Similar News