ప్రిడేటర్.. శత్రువు గుండెల్లో పిడుగు.. ఇక భారత్ కూ సొంతం

'డ్రోన్' అనే ఓ ఆయుధం ఎంత కీలకంగా మారిందో..? అలాంటి డ్రోన్లకే అమ్మ మొగుడు లాంటిదానిని భారత్ సంపాదించింది.

Update: 2024-10-16 19:30 GMT

ఒకప్పుడు యుద్ధాలంటే భారీ ఫిరంగులు, శతఘ్నులు.. బీభత్సమైన ఫైటర్ జెట్లు.. యుద్ధ విమానాలు.. శత్రువును భయపెట్టే క్షిపణులు.. కానీ, కాలం మారుతోంది. యుద్ధం చేసే తీరూ మారుతోంది. ఇప్పుడు జరుగుతున్న రెండు యుద్ధాల (ఇజ్రాయెల్-హమాస్, రష్యా-ఉక్రెయిన్)లో ఓ చిన్న ఆయుధం పెద్ద పనిచేస్తోంది. అంతెందుకు..? మొన్నటికి మొన్న రష్యా తమ అణ్వస్త్ర విధానాన్ని సమూలంగా మార్చింది. దానిప్రకారం ఇక మీదట 'డ్రోన్' దాడి చేసినా తాము అణ్వాయుధాలను ప్రయోగించడం గురించి ఆలోచిస్తామని స్పష్టం చేసింది. దీన్నిబట్టే తెలుస్తోంది.. 'డ్రోన్' అనే ఓ ఆయుధం ఎంత కీలకంగా మారిందో..? అలాంటి డ్రోన్లకే అమ్మ మొగుడు లాంటిదానిని భారత్ సంపాదించింది.

ఆకాశంలో గద్దలా.. బరువు మోయడంలో గాడిదలా..

గంటకు 442 కిలోమీటర్ల గరిష్ఠ వేంగం.. 50 వేల అడుగుల ఎత్తులో.. ఏకంగా 35 గంటలు అలా ఎగురుతూనే ఉండగలవు.. ఇదేదో గద్దల గురించి కాదు.. ఓ అత్యాధునిక నిఘా పరికరాలు అమర్చిన డ్రోన్ గురించి. అంతేకాదు.. గాడిదలా ఏకంగా 1,700 కేజీల పేలోనూ మోయగలదు. 450 కేజీల బరువున్న బాంబులనూ తీసుకెళ్లగలదు. అందుకే దానిని డ్రోన్లకే అమ్మ మొగుడు అంటారు. దాని పేరే ప్రిడేటర్. అమెరికా అత్యాధునిక హెల్‌ ఫైర్‌ క్షిపణలనూ ప్రిడేటర్ డ్రోన్లు ప్రయోగించగలవంటే వాటి సత్తా ఏమిటో తెలుసుకోవచ్చు.

రెండువైపులా పదునున్న కత్తి..

ప్రిడేటర్ డ్రోన్లు గురించి చెప్పాలంటే ఇవి రెండువైపులా పదునున్న కత్తి అనాలి. నిఘా సమాచార సేకరణతో పాటు.. శత్రువును గుర్తించి దాడి కూడా చేస్తాయి. ఇలాటి ప్రిడేటర్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసింది. పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లోనే కాక.. సముద్ర తీరం, హిమాలయ శిఖరాల్లోనూ భారత భద్రతా దళాలకు ఇవి సరికొత్త బలం. కాగా, మన పొరుగున ఉండే చైనాకు చియాహాంగ్‌-4, వింగ్‌ లుంగ్‌-2, పాకిస్థాన్ వద్ద షాహపర్‌-2, వింగ్‌ లుంగ్‌-2, బైరక్తర్‌ టీబీ-2 డ్రోన్లు ఉన్నాయి. ఈ స్థాయిలో భారత్ కు డ్రోన్లు లేవు. అయితే, ఒక్క ప్రిడేటర్ దెబ్బతో పాక్, చైనా సరిహద్దుల్లో పరిస్థితి అంతా మారిపోనుంది.

డేగ కళ్లతో..

ప్రిడేటర్లవి డేగ కళ్లనే చెప్పాలి. సరిహద్దుల్లో కదలికలను అంత స్పష్టంగా గుర్తిస్తాయివి. చైనాతో వాస్తవాధీన రేఖ వద్ద, పాకిస్థాన్ తో నియంత్రణ రేఖ వద్ద విమానాల కదలికలు, ట్యాంకుల మోహరింపులు, బంకర్లు, రాకెట్స్‌, మిసైల్‌ వ్యవస్థలను పసిగడతాయి. అంతేకాదు.. అత్యవసర సమయంలో దాడులకూ దిగి ప్రత్యర్థులను అడ్డుకుంటతాయి. ప్రిడేటర్లలో ఒక రకమైన స్కైగార్డియన్‌ డ్రోన్లను అమెరికా జనరల్‌ అటామిక్స్ సంస్థ నుంచి భారత్‌ లీజుకు తీసుకొంది. తూర్పు లద్ధాఖ్‌ లో నాలుగేళ్ల కిందట చైనా దుందుడుకు చర్యల సమయంలో రంగంలోకి దింపింది. స్పష్టమైన చిత్రాలను దళాలకు అందించాయి. ఇక ప్రిడేటర్ డ్రోన్లను తమిళనాడులోని అరక్కోణం, గుజరాత్‌ పోర్‌బందర్‌, యూపీలోని సర్‌సవ, గోరఖ్‌ పుర్‌ లలో మోహరిస్తారు.

నౌకా దళానికీ..

నౌకా దళానికీ ప్రిడేటర్ డ్రోన్లను అందించనున్నారు. వీటి పేరు సీగార్డియన్‌. ప్రత్యేకమైన 360 డిగ్రీ సర్ఫేస్‌ సెర్చి మారిటైమ్‌ రాడార్‌ వీటిలో ఉంటుంది. సబ్ మెరైన్ యుద్ధంలో ఇది అత్యంత ప్రమాదకరం. హిందూ మహా సముద్రంలో చైనా నౌకలు పరిశోధనల కోసం వచ్చి తిష్ఠ వేస్తున్నాయి. ఆ పేరిట గూఢచర్యం చేస్తున్నాయి. సీగార్డియన్స్ వస్తే అవి తోకముడిచినట్లే. కాగా, అమెరికాతో భారత్ చేసుకున్న డీల్‌ లో హెల్ ఫైర్ క్షిపణులు 170 వరకు అందనున్నాయి. వీటి గురించి చెప్పాలంటే.. ఇరాన్‌ జనరల్‌ ఖాసీం సులేమానీ, అల్‌ ఖైదా చీఫ్‌ అల్‌ జవహరీని హతమార్చింది వీటితోనే. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, ఇటలీ, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, యూకే మాత్రమే ప్రిడేటర్లను కలిగి ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూ అందాయి.

Tags:    

Similar News