చరిత్రలో తొలిసారి.. లోక్ సభ స్పీకర్ పోస్టుకు ఎన్నిక.. ఇండియా అభ్యర్థి ఆయనే!

17వ లోక్ సభలో స్పీకర్ గా బీజేపీకి చెందిన ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మళ్లీ ఆయననే ఎన్డీయే నిలిపింది.

Update: 2024-06-25 07:11 GMT

75 ఏళ్ల భారత పార్లమెంటు చరిత్రలో ఇప్పటివరకు లోక్ సభ స్పీకర్ పోస్టుకు ఎన్నిక జరగకపోవడం ఓ పెద్ద విశేషం. సాధ్యమైనంత వరకు అధికార పార్టీనే స్పీకర్ పదవిని కైవసం చేసుకుంటుంది కాబట్టి.. ప్రతిపక్షాలు కూడా అభ్యర్థిని నిలపవు. అయితే, ఇటీవలి ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి దీటుగా సీట్లు సాధించిన ‘ఇండియా’ ఏమాత్రం తగ్గే ఉద్దేశంలో లేదని స్పష్టమవుతోంది. అందులోనూ స్పీకర్ పదవి అంటే అత్యంత కీలకం.

ఈ ఉద్దేశంలోనే..

ఇప్పటికైతే మోదీ సర్కారుకు వచ్చిన ముప్పేమీ లేదు. ఏపీ సీఎం, టీడీపీ ధినేత చంద్రబాబు, బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నీతీశ్ కుమార్ మద్దతు కొనసాగిస్తారనే చెప్పవచ్చు. చంద్రబాబు కాకున్నా.. భవిష్యత్ లో నీతీశ్ హ్యాండివ్వరనే గ్యారంటీ ఏమీ లేదు. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. అలాంటి సమయంలో లోక్ సభ స్పీకర్ పాత్ర కీలకం. అంతేకాక.. ముందుముందు సైతం తాము మోదీ సర్కారును ఇరకాటంలో పెడుతూనే ఉంటామనే ఉద్దేశాన్ని చాటేందుకు ఇండియా కూటమి ‘స్పీకర్ ఎన్నిక’ను అనివార్యం చేసింది.

ఇటు మళ్లీ బిర్లా.. అటు ఎవరంటే..?

17వ లోక్ సభలో స్పీకర్ గా బీజేపీకి చెందిన ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మళ్లీ ఆయననే ఎన్డీయే నిలిపింది. ఇప్పుడు ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో దేశ చరిత్రలో తొలిసారి స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఓం బిర్లా నామినేషన్‌ వేశారు. మరోవైపు విపక్ష ఇండియా కూటమి నుంచి కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ కె.సురేశ్‌ బరిలో నిలిచారు.

డిప్యూటీ స్పీకర్ అయినా..

లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇస్తారు. కానీ, దీనిని పాటించడం లేదు. గత లోక్ సభలో అయితే చరిత్రలో తొలిసారి అసలు డిప్యూటీ స్పీకరే లేరు. దీన్నిబట్టే మోదీ సర్కారు ఎలాంటి ఉద్దేశంలో ఉన్నదో స్పష్టమవుతోంది.

కె.సురేశ్ సీనియర్

కేరళకు చెందిన కె.సురేశ్ దళిత నేత. 8 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. వాస్తవానికి ఈయననే ప్రొటెం స్పీకర్ చేయాలని (సభ్యుల ప్రమాణం కోసం) ఇండియా కూటమి డిమాండ్ చేసింది. కానీ, వరుసగా గెలుపు అనే కారణాన్ని చూపుతూ.. ఎన్డీఏ కూటమి మెహతాబ్ ను ప్రొటెం చేసింది.

Tags:    

Similar News