రచ్చకెక్కిన భారత పార్లమెంటు.. ప్రపంచ దేశాల ముందు.. !
అంతేకాదు.. ఏకగ్రీవంగా స్పీకర్‌ను ఎన్నుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే.. అటు ట్రెజరీ, ఇటు అప్పో జిషన్‌కు న్యాయం చేయాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుంది కనుక.. ఉమ్మడిగానే స్పీకర్‌ను ఎన్నుకునే వారు.
''ఇదిగో ఆ దేశ పార్లమెంటులో సభ్యులు కొట్టుకున్నారు. మనమే నయం''- అని చెప్పుకొనే రోజులు త్వరలోనే సమసి పోనున్నాయా? ప్రపంచ దేశాల పార్లమెంటుల ముందు.. భారత పార్లమెంటు కూడా.. పలుచ న కానుందా? అంటే.. ఔననే అంటున్నారు మేధావులు. భారత పార్లమెంటు వ్యవహారం.. తాజాగా జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎక్కింది. బీబీసీ సహాపలు చానెళ్లు.. లైవ్ ప్రసారాలు చేయడం.. ప్రపంచ దేశాల ప్రజలు కూడా.. ఆన్‌లైన్‌లో ''భారత్ లో ఏం జరుగుతోంది'' అని ఆసక్తిగా గమనించడం.. విశేషం.
ఏం జరిగింది?
ఇప్పటి వరకు భారత దేశ పార్లమెంటు అంటే.. చాలా పద్ధతికి.. కొన్ని కొన్ని విషయాల్లో ఐకమత్యానికి ప్రతీ కగా నిలిచింది. ముఖ్యంగా ఎస్సీలను, బీసీలను స్పీకర్లుగా చేసినప్పుడు.. అన్ని పార్టీలూ హర్షించాయి. అంతేకాదు.. ఏకగ్రీవంగా స్పీకర్‌ను ఎన్నుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే.. అటు ట్రెజరీ, ఇటు అప్పో జిషన్‌కు న్యాయం చేయాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుంది కనుక.. ఉమ్మడిగానే స్పీకర్‌ను ఎన్నుకునే వారు. కరడు గట్టిన కమ్యూనిస్టు చటర్జీని స్పీకర్‌గా ఎన్నుకున్నప్పుడు కూడా.. బీజేపీ సహకరించింది.
అప్పటికి మోడీ ఇంకా జాతీయ రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి బహుశ పార్లమెంటు మన్ననలందుకుంది. ఇలా.. ఇప్పటి వరకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. స్పీకర్ విషయంలో రగడ లేదు. రాజీనే. కానీ, తొలి సారి భారత పార్లమెంటు చరిత్రలో స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. దీనికి బుధవారం(26-06) ముహూర్తం నిర్ణయించారు. ఇటు అధికార పక్షం ఎన్డీయే కూటమి తరఫున పాత ముఖం.. ఓం బిర్లా, అటు ఇండియా కూటమి తరఫున కేరళకు చెందిన కె. సురేష్‌లు నామినేషన్ వేశారు.
ఈ పరిణామమే ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనూ పార్లమెంటు రచ్చపై చర్చ జరిగేలా చేసింది. ''మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిస్తున్నాయి. ఆదర్శకంగా నిలుస్తున్నాయి'' అని ఈనెల 9న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మోడీ ప్రవచించారు. కానీ, దీనికి విరుద్ధంగా సంస్కృతి, సంప్రదాయాలకు ఏమాత్రం తావులేకుండా.. ఆయన నేతృత్వంలోని బీజేపీ వ్యవహరిస్తున్న తీరు.. ప్రపంచ దేశాల ముందు.. పార్లమెంటును పలుచన చేసే పరిస్థితి వచ్చిందని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నిక జరిగితే తప్పేంటి? అనే వారు కూడా ఉన్నారు. కానీ, పార్లమెంటు పెద్దలు ఒక సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. దీనిని కొనసాగించాల్సి ఉంది. ప్రతిపక్షానికి అసలు ఉనికి లేకుండా చేయాలన్న కుటిల నీతితో ముందుకు సాగుతున్నందుకే ఇప్పుడు స్పీకర్ ఎన్నిక వచ్చింది తప్ప.. ఈ విషయంలో ప్రతిపక్షాల తప్పులేదు. ఏదేమైనా.. మోడీ తీరు.. ప్రపంచం ముందు భారత్‌ను అనేక విషయాల్లో ఇబ్బంది పెడుతోందని అంటున్నారు పరిశీలకులు.