అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. భారతీయుల మద్దతు ఈ పార్టీకే!
ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముచ్చటగా మూడోసారి పోటీ పడుతున్నారు. ఇక అధికార డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆ దేశ ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రంగంలోకి దిగుతున్నారు.
వాస్తవానికి ముందు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రంగంలోకి దిగారు. అయితే ఆయనకు వయసు సమస్యగా మారడంతో చివరకు సొంత పార్టీ నేతల విమర్శల మధ్య పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రంగంలోకి దిగారు.
కాగా అమెరికాలో పెద్ద ఎత్తున ఉన్న భారతీయ అమెరికన్లు ఎవరికి మద్దతు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న కమలా హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తే అయినా ఆమె భారత వ్యతిరేకి అని టాక్ నడుస్తోంది.
అయినప్పటికీ డోనాల్డ్ ట్రంప్ ను ఇప్పటికే ఒక పర్యాయం అధ్యక్షుడిగా అమెరికా ప్రజలు చూసి ఉండటం, ఆయన వ్యవహార శైలి ఏంటో తెలుసుకుని ఉండటంతో కమలా హారిస్ వైపే భారతీయ అమెరికన్లు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. తాను అధికారంలోకి వస్తే భారీ సంఖ్యలో వలసదారులను దేశం నుంచి బహిష్కరిస్తానని ట్రంప్ చెబుతుండటంతో భారతీయ అమెరికన్లు కమలా హారిస్ వైపు మళ్లుతున్నారని తెలుస్తోంది.
వాస్తవానికి భారతీయ అమెరికన్లు ముందు డోనాల్డ్ ట్రంప్ కు మద్దతు ఇద్దామనుకున్నారు. అయితే తాజా నివేదికల ప్రకారం భారతీయ అమెరికన్లలో 68 శాతం మంది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు అనుకూలంగా ఉన్నట్టు ఒక సర్వే తేల్చింది. 29 శాతం మంది భారతీయ అమెరికన్లు మాత్రమే డోనాల్డ్ ట్రంప్ కు మద్దతు ఇస్తున్నట్టు తేలింది.
ముఖ్యంగా అమెరికాలోని జార్జియా, కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్లు పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కమలా హారిస్ కు భారీ ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.
2022 నాటికి అమెరికాలో దాదాపు 4.8 మిలియన్ల భారతీయ అమెరికన్లు ఉన్నారు. ఇక ఆసియా అమెరికన్లు జనాభాలో 20% ఉన్నారు. వీరిలో 66% మంది వలసదారులే. ఇందులో 34 శాతం మంది అమెరికాలో జన్మించినవారే.
భారతీయ అమెరికన్లలో సగం మంది కాలిఫోర్నియా (20%), టెక్సాస్ (12%), న్యూజెర్సీ (9%), న్యూయార్క్ (7%)లలో నివసిస్తున్నారు.
భారతీయ అమెరికన్ల సగటు కుటుంబ ఆదాయం 2022లో 145,000 డాలర్లుగా ఉంది, ఇది మొత్తం ఆసియా అమెరికన్ల సగటు 100,000 డాలర్ల కంటే ఎక్కువ.
చాలా మంది భారతీయ అమెరికన్లు (41%)ను ప్రాథమికంగా ‘ఇండియన్‘ గా గుర్తించారు. అయితే 21% మంది తాము ‘ఇండియన్ అమెరికన్’ అని చెప్పుకుంటున్నారు.
భారతీయ అమెరికన్లు సాధారణంగా అమెరికా పట్ల 86% అనుకూలంగా, ఇండియా పట్ల 76 శాతం అనుకూలంగా ఉంటున్నారు. రెండింటి పట్ల సానుకూల అభిప్రాయాలను కలిగి ఉంటారు. అయినప్పటికీ.. 65% మంది భారతదేశానికి తిరిగి వెళ్లరు.