యూఎస్ బహిష్కరణ ఇష్యూ: స్టూడెంట్స్ సరే... వీరి పరిస్థితి ఏమిటి?
ప్రస్తుతం యూఎస్ నుంచి వెనక్కిపంపబడిన భారతీయ విద్యార్థుల తల్లితండ్రుల పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది
సార్... మా అమ్మాయికి అమెరికాలో యూనివర్శిటీలో సీటు వచ్చింది. రేపే ప్రయాణం. ఒక తండ్రి ఆనందం! వదిన గారూ... మా అబ్బాయికి యూఎస్ వీసా వచ్చిందండి. ఈ వారం లోనే ప్రయాణం. ఒక తల్లి సంబరం! అయితే ఈ సంబరాలు, సంతోషాలు యూఎస్ ఫ్లై ట్ ఎక్కిన గంటల వ్యవధిలోనే ఆవిరైపోతే... ఆ తల్లి తండ్రుల ఆవేదన ఎలా ఉంటుంది?
ప్రస్తుతం యూఎస్ నుంచి వెనక్కిపంపబడిన భారతీయ విద్యార్థుల తల్లితండ్రుల పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఆ విద్యార్థుల సంగతి కాసేపు పక్కనపెడితే... వారిని ఎన్నో ఆశలతో, మరెన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పంపిన విద్యార్థుల తల్లితండ్రుల మానసిక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందనేది చర్చనీయాంశం అవుతుంది.
ఇటు కొలీగ్స్ తో చెప్పుకోలేక, చుట్టాలతో పంచుకోలేక ఆ తల్లితండ్రులు పడే మనోవేదన అంతా ఇంతా కాదనే చెప్పాలి. వీసా రాకపోయినా అదో రకం ప్రయత్నం విఫలమైందనే బాద! కానీ.. ఇదేమిటి? అమెరికాలో దిగిన అనంతరం రిటన్ ఫ్లైట్ ఎక్కి తిరిగి వెనక్కి రావడం?
పైగా అనేక రకాల కారణాలతో విద్యార్థులు అమెరికా నుంచి వెనక్కి పంపబడినప్పటికీ... తప్పుడు ధృవీకరణ పత్రాలే కారణం అంటూ సోషల్ మీడియాలో ఇష్యూస్ వైరల్ అవుతుండటంతో... ఇది మరింత అవమానకరంగా మారిందని అంటున్నారు. అంటే... రిటన్ ఫ్లైట్ ఎక్కించబడిన ప్రతీ విద్యార్థీ తప్పుడు ధృవీకరణ పత్రాలే ఇచ్చారా అనే అభిప్రాయం జనాల్లోకి వెళ్లిపోయిందని అంటున్నారు.
ఇక ఆర్థిక పరిస్థితుల సంగతి మరొకెత్తు! తమ పిల్లలను అమెరికాకు పంపడానికి అందరి తల్లితండ్రులకూ సరిపడా ఆర్థిక స్థోమత ఉండకపోవచ్చు! కొంతమంది అప్పులు చేసి, మరికొంతమంది ఆస్తులు అమ్ముకుని మరీ ఈ ప్రయత్నం చేసి ఉంటారు. ఇప్పటికే వీసాలకు, ఫీజులకు ఎంతో మొత్తం చెల్లించి ఉంటారు! వాటి నుంచి ఎప్పటికి తేరుకోవాలి?
ఇలా ఆర్థికంగా, సామాజికంగా... తల్లితండ్రులకు ఎన్నో ఇబ్బందులను తెచ్చి పెట్టింది తాజా సంఘటన. ఇలా ప్రతీ ఏటా సుమారు వందల సంఖ్యలో భారతీయ విధ్యార్థులు అనేక రకాల కారణాలతో ఎయిర్ పోర్ట్ నుంచే వెనక్కి తిప్పి పంపబడటం జరుగుతుంది! తాజాగా 21 మంది విద్యార్థులు ఒకేసారి వెనక్కి పంపబడిన సంగతి తెలిసిందే!
దీంతో ఇకపై యూఎస్ వీసా కోసం అప్లై చేసుకునే విద్యార్థులు... వారి భవిష్యత్తుకంటే ముఖ్యంగా వారి తల్లి తండ్రుల పరిస్థితిని, వారి దైనందిన జీవితాన్ని, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పత్రాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు ఈ సందర్భంగా సూచిస్తున్నారు.