మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్... డేట్ చెప్పిన ఎస్ & పి గ్లోబల్!
ఈ క్రమంలో భారత్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి వివిధ అంశాలు దోహదం చేస్తున్నాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ పేర్కొంది.
ప్రపంచంలో ప్రస్తుతం భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత భారత్ ఉంది. అయితే అతి తక్కువ సమయంలో త్వరలోనే భారత్.. జపాన్ ని సైతం దాటేస్తుందని.. ఫలితంగా టాప్ 3లో స్థానం దక్కించుకుంటుందని అంటున్నారు. ఈ మేరకు ఎస్ అండ్ పీ గ్లోబల్ వివరాలు వెల్లడించింది. ఇది కచ్చితంగా భారత్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి!
అవును... ప్రపంచంలో ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియా.. 2030 నాటికి జపాన్ ను దాటేయనుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ అంచనా వేసింది. ఇందులో భాగంగా... 2030 నాటికి 7.3 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని పేర్కొంది. కాగా... 2022లో భారత జీడీపీ 3.5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదు చేసుకున్న భారత్.. ఈ ఏడాది పూర్తి ఆర్థిక సంవత్సరానికి 6.2 - 6.3 శాతం మేర వృద్ధి చెందొచ్చని అంచనా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ అండ్ పీ గ్లోబల్ తాజా అంచనాలను వెలువరించింది. ఇందులో భాగంగా మరో ఏడేళ్లలో అది 7.3 ట్రిలియన్లకు చేరుతుందని పేర్కొంది.
ప్రస్తుతం అమెరికా 25.5 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అంటే... ప్రపంచ జీడీపీలో నాలుగో వంతు వాటా అమెరికాదే అన్నమాట. ఇక అగ్రరాజ్యం తర్వాత స్థానంలో 18 ట్రిలియన్ డాలర్లతో చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండగా.. 4.2 ట్రిలియన్ డాలర్లతో జపాన్, 4 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో జర్మనీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
అయితే 2030 నాటికి 4 ట్రిలియన్ డాలర్లు ఉన్న జర్మనీని.. 4.2 ట్రిలియన్ డాలర్ల జీడీపీ ఉన్న జపాన్ ని కూడా భారత్ దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా... జపాన్ జీడీపీని దాటేసి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానూ.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా నిలవనుందని అంచనా వేసింది.
ఈ క్రమంలో భారత్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి వివిధ అంశాలు దోహదం చేస్తున్నాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ పేర్కొంది. ఇందులో భాగంగా... దేశంలో మధ్యతరగతి ఆదాయాలు వేగంగా పెరుగుతున్నాయని, ఫలితంగా వినియోగ వస్తువుల వినిమయం పెరగనుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ వెల్లడించింది.
ఫలితంగా... కచ్చితంగా 2030 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని చెబుతోంది. ఇదే సమయంలో... 2030 నాటికి 110 కోట్ల మంది జనాభాకు ఇంటర్నెట్ అందుబాటులోకి రానుందని తెలిపింది.