భారత్ ఎగుమతి చేసే రెండో అతిపెద్ద సరుకు ఐఫోన్.. ఎన్ని వేల కోట్లో తెలుసా?

ఈ సమయంలో ఐఫోన్ ఎగుమతులపై ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

Update: 2024-10-29 21:30 GMT

భారత్ - అమెరికా మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయని అంటున్నారు. రేపు అమెరికాకు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైతే ఏమైనా మారుతుందా లేదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. ఇప్పటివరకూ అయితే ఈ వ్యవహారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉందని చెబుతున్నారు.

పైగా.. ఇటీవల కాలంలో అమెరికా - చైనా మధ్య సానుకూలత తగ్గడం, ఉద్రిక్తతలు పెరగడంతో.. బీజింగ్ పై ఆధారపడటాన్ని అగ్రరాజ్యం తగ్గించుకోవాలని చూస్తుందని.. ఈ నేపథ్యంలో... ఐఫోన్ లక్ష్యాలను సాధించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంటున్నారు. ఈ సమయంలో ఐఫోన్ ఎగుమతులపై ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

అవును... ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో భారత్ నుంచి సుమారు 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.50 వేల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయినట్లు కథనాలొస్తున్నాయి. ఇదే సమయంలో... మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతులు 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ.85వేల కోట్లు) ను దాటేయొచ్చని అంటున్నారు.

దీంతో... భారత్ లో యాపిల్ ఐఫోన్ల తయారీ కేంద్రం వేగంగా ఎదుగుతోందనే చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పటికే యాపిల్ కు ప్రధాన సరఫరాదరులైన ఫాక్స్ కాన్ చెన్నై శివార్లలో అసెంబ్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసింది. ఇక కర్ణాటకలోని టాటా గ్రూపు ఫ్యాక్టరీ నుంచి ఏప్రిల్ - సెప్టెంబర్ లో 1.7 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్ లు ఎగుమతి చేశారు.

ఈ నేపథ్యంలో ఫెడరల్ ట్రేడ్ మినిస్ట్రీ డేటా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... భారత్ నుంచి అమెరికాకు అత్యధికంగా ఎగుమతి అవుతోన్న రెండో సరుకుగా ఐఫోన్ నిలిచిందని.. వీటి విలువ ఈ ఏడాది తొలి ఐదు నెలలలోనే 2.88 బిలియన్ డాలర్లని తెలిపింది. ఇదే క్రమంలో... భారత్ లో ఐఫోన్ అమ్మకాలు 2030 నాటికి $33 బిలియన్లకు చేరొచ్చని బ్లూమ్ బెర్గ్ అంచనా వేసింది.

Tags:    

Similar News