నాడు వైఎస్సార్‌.. నేడు ఇరాన్‌ అధ్యక్షుడు!

ఇప్పుడు అదే తరహాలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి అమీర బ్దొల్లహియన్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూడా వాతావరణం సరిగా లేక అడవిలో కుప్పకూలిందని చెబుతున్నారు.

Update: 2024-05-20 06:22 GMT

హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతోపాటు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అమీర బ్దొల్లహియన్, తదితరులు మృత్యువాత పడ్డారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా ఇలాగే హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. నాడు హైదరాబాద్‌ నుంచి చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరిన వైఎస్సార్‌ హెలికాప్టర్‌ నల్లమల అడవుల మీదుగా ప్రయాణిస్తుండగా వాతావరణం సరిగా లేక కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో వైఎస్సార్‌తోపాటు మరికొందరు మృత్యువాత పడ్డారు.

ఇప్పుడు అదే తరహాలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి అమీర బ్దొల్లహియన్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూడా వాతావరణం సరిగా లేక అడవిలో కుప్పకూలిందని చెబుతున్నారు. ఈ ఘటనలో వీరితోపాటు తూర్పు అజర్‌ బైజాన్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ కూడా మృత్యువాత పడ్డారు.

ఇరాన్‌ – అజర్‌ బైజాన్‌ సరిహద్దుల్లో ఈ రెండు దేశాలు కలిసి ప్రాజెక్టులను నిర్మించాయి. వీటిని ఇబ్రహీం రైసీ, అజర్‌ బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హమ్‌ అలియేవ్‌ ప్రారంభించారు. అక్కడి నుంచి తబ్రిజ్‌ పట్టణానికి తిరిగొస్తుండగా ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ జోల్పా నగర సమీపంలో కుప్పకూలింది.

మరోవైపు అన్ని వేళ్లూ ఇజ్రాయెల్‌ వైపు చూపుతున్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్‌ – హమాస్‌ కు మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఆరు నెలల క్రితం మొదలయిన యుద్ధం ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో హమాస్‌ కు ఇరాన్‌ అన్ని విధాలుగా అండదండలు అందిస్తోంది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్‌ ఇటీవల ఇరాన్‌ ఆయుధ డిపోపై దాడులు చేసి మిలిటరీ కమాండర్‌ ను హత్య చేసింది. ఇందుకు ప్రతిగా ఇరాన్‌ సైతం ఇజ్రాయెల్‌ పైకి వేలాది క్షిపణులను ఇటీవల ప్రయోగించింది. ఈ క్రమంలో ఇరు దేశాలు ఒకరికొకరు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసుకున్నాయి.

ఇంకోవైపు ప్రస్తుతం మధ్యధర సముద్రంలో, ఎర్ర సముద్రంలో, అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై ముఖ్యంపై అమెరికా, ఇజ్రాయెల్‌ మిత్ర దేశాల నౌకలపై హౌతీలు చేస్తున్న దాడులకు ఇరాన్‌ మద్దతిస్తోంది. హౌతీలను వెనుకుండి నడిపిస్తోంది. ఇటీవల పలు నౌకలపై హౌతీలు దాడులు చేశారు. వీరివల్ల అమెరికా, ఇజ్రాయెల్‌ మిత్ర దేశాల నౌకలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన ఘటన ప్రమాదమా లేక ఇజ్రాయెల్‌ కుట్ర అనేదానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అందులోనూ ఇజ్రాయెల్‌ గూఢచారి వ్యవస్థ.. మొస్సాద్‌ కు ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా పేరు ఉంది. తమ శత్రువులు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వారిని గుట్టుచప్పుడు కాకుండా మట్టుబెట్టడంలో మొస్సాద్‌ ను మించింది లేదని అందరూ చెప్పే మాట. ఈ నేపథ్యంలో అన్ని వేళ్లూ ఇజ్రాయెల్‌ వైపే అనుమానంగా చూస్తున్నాయి.

కాగా ఇబ్రïß ం రైసీ మృతి చెందారని ఇరాన్‌ మీడియాతోపాటు అంతర్జాతీయ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ రాజ్యాంగం ప్రకారం తదుపరి అధ్యక్షుడిగా ఆ దేశ మొదటి ఉపాధ్యక్షుడు మహ్మద్‌ మొక్బర్‌ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఇందుకు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఇరాన్‌ రాజ్యాంగం ప్రకారం దేశ అధ్యక్షుడు మరణించిన 50 రోజుల్లోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News