జొన్వాడ ఫామ్ హౌస్ కు ఇరిగేషన్ అధికారులు.. ఏం జరుగుతోంది?

ఈ క్రమంలో గత ఆదివారం హైడ్రా గండిపేట జలాశయం ఫుల్ ట్యాంక్ లెవల్ లో ఉన్న ప్రముఖుల నిర్మాణాలను పడగొట్టింది.

Update: 2024-08-27 12:18 GMT

దాదాపు మూడేళ్ల కిందట మీడియాలో ప్రముఖంగా నిలిచింది జొన్వాడ ఫామ్ హౌస్. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు చెందినదిగా కథనాలు రావడమే దీనికి కారణం. అయితే, ఇదే సమయంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడ రేవంత్ రెడ్డి జొన్వాడ ఫాంహౌస్ పై డ్రోన్ ఎగురవేశారు. దీంతో ఆయన మీద కేసు నమోదు చేశారు. జైలుకు కూడా పంపారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మరోవైపు రేవంత్ సీఎం అయ్యాక తీసుకొన్న పెద్ద నిర్ణయం హైడ్రా ఏర్పాటు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రిటెక్షన్ అథారిటీ (హైడ్రా)కి సీనియర్ ఐపీఎస్ ఏవీ రంగనాథ్ ను కమిషనర్ గా నియమించడం.. ఆ సంస్థ దూకుడుగా అక్రమణ నిర్మాణాలను కూల్చివేయడం అంతా పెద్ద సంచలనం అవుతోంది. ఈ క్రమంలో గత ఆదివారం హైడ్రా గండిపేట జలాశయం ఫుల్ ట్యాంక్ లెవల్ లో ఉన్న ప్రముఖుల నిర్మాణాలను పడగొట్టింది. ఇక తదుపరి వంతు జొన్వాడ ఫాంహౌజ్ అనే మాట వినిపించింది.

గత బుధవారం కోర్టుకు..

18వ తేదీన గండిపేట చెరువు ఎఫ్టీఎల్ లోని నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా బుల్డోజర్లు.. తదుపరి జొన్వాడ ఫాంహౌజ్ దిశగా కదులుతున్నాయన్న కథనాలతో ఆ ఫాంహౌజ్ యజమాని ప్రదీప్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైడ్రా కూల్చే ప్రమాదం ఉందని ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. కూల్చకుండా స్టే ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం, హైడ్రా విధి విధానాలను ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని అడిగింది. విచారణ అనంతరం, పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. కూల్చివేత నిబంధనల ప్రకారమే ఉండాలని స్పష్టం చేసింది. జీవో 99 ప్రకారం ముందుకు సాగాలని హైడ్రాకు సూచించింది. కాగా, జొన్వాడ ఫాం హౌజ్ జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించినా 111 జీవో పరిధిలో ఉందనే ఆరోపణలున్నాయి.

తన ఫాంహౌజ్ కాదంటున్న కేటీఆర్

జొన్వాడ్ ఫాంహౌజ్ తనది కాదని.. తన మిత్రుడు ప్రదీప్ రెడ్డి నుంచి లీజుకు తీసుకున్నట్లు కేటీఆర్ చెబుతున్నారు. తనకు ఫాం హౌజ్ లేదని స్పష్టం చేశారు. హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకున్నా ఇబ్బంది లేదని చెప్పారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే కూల్చుకోమని పేర్కొన్నారు. కాగా,

జొన్వాడ ఫాంహౌస్‌ వెనుకే సర్వే నెంబర్ 301లో కేటీఆర్ భార్య శైలిమ భూమి కొని పండ్ల తోట వేశారనే ఆరోపణలున్నాయి. ఆ భూమిలోకి ఈ ఫాంహౌస్‌ గేటులో నుంచే వెళ్లాలని... ఫాంహౌస్ నుంచి మరోవైపున ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కు కనెక్ట్ అయ్యేలా మరో రోడ్డు కూడా వేశారని చెబుతారు. అన్నిటికిమించి సర్వే నం.311లో జొన్వాడ ఫాంహౌజ్ ఉంది. రేవంత్ రెడ్డి గతంలో దీనిపై ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు కూడా. ఎన్జీటీ ఓ కమిటీని వేయగా.. అది రంగంలోకి దిగకుండానే హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్‌. ఆ ఫాంహౌజ్ తనది అంటూ ప్రదీప్‌ రెడ్డి కూడా హైకోర్టులో పిల్ వేశారు. అదంతా వదిలేస్తే కేటీఆర్ ఫాంహౌజ్ ను లీజుకు తీసుకోవడం ఏమిటనే ప్రశ్నలు కూడా వచ్చాయి.

రంగంలోకి అధికారులు..

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జొన్వాడ ఫాంహౌజ్ కు మంగళవారం సాగునీటి శాఖ అధికారులు చేరుకున్నారు. కొలతలు వేశారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో జొన్వాడ ఫాంహౌజ్ ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏం జరగబోతున్నది అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ సినీ హీరో నాగార్జన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసినట్లు ఏ తెల్లవారుజామున హైడ్రా బుల్డోజర్లు జొన్వాడ ఫామ్ హౌజ్ మీదకు వెళ్తే అది పెద్ద సంచలనమే అవుతుంది.

Tags:    

Similar News