నాడు జగన్... నేడు చంద్రబాబు.. సేమ్ టు సేమ్ జరిగిందా..?
ఇక, ఇదేసమయంలో అదానీకి చంద్రబాబు రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. అటు పక్షం ఇటు, ఇటు పక్షం అటు మారింది.
ఏపీలో ఏదో జరిగిపోతోందని.. రాష్ట్రం అప్పుల మయం అయిపోతోందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం గుర్తుంది కదా! వైసీపీ హయాంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ఊరూ వాడా ప్రచా రం చేసిన విషయం గుర్తుంది కదా! ఏపీని శ్రీలంకతో కొన్ని రోజులు, ఉగాండా వంటి అత్యంత దుర్భర ఆఫ్రికన్ దేశంతో మరికొన్ని రోజులు పోలుస్తూ... నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. జగన్ జమానా అప్పులు ఖజానా నినాదాన్ని కూడా ఊరూ వాడా ప్రచారం చేశారు.
కట్ చేస్తే.. ఈ విషయం ఒక్కటే కాదు.. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ.. ఇలానే ప్రచారం జరిగింది. ఈ ప్రాజెక్టు ఎత్తును జగన్ తగ్గించేస్తున్నారని, ఇక, ఇది ఒక మధ్యతరహా ప్రాజెక్టుగానే (ప్రకాశం బ్యారేజీ టైపు) మారిపోనుందని కూడా చెప్పుకొచ్చారు. కేంద్రంతో లాలూచీ పడ్డారని కూడా వ్యాఖ్యానించారు. గుండెలు బాదుకున్నారు. కన్నీరు పెట్టుకోలేదు అంతే! కథ ఇక్కడితో కూడా ముగియలేదు. గౌతం అదానీకి రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు.
రోజూ అవే విమర్శలు. అవే కథనాలు. అవే వార్తలతో రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తించారు. ఇక్కడ యూటర్న్ తీసుకుంటే.. ఇప్పుడు ఇవే కథనాలు, ఇవే విమర్శలు అటు వైసీపీ శిబిరం నుంచి వినిపిస్తున్నాయి. రాష్ట్రా న్ని కూటమి ప్రభుత్వం అప్పులు మయం చేస్తోందని, వచ్చిన నాలుగు మాసాల్లోనే 72 వేల కోట్ల అప్పులు చేశారని వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. అంతేకాదు.. పోలవరం గురించి గత నాలుగు రోజులుగా కథనాలురాస్తూనే ఉన్నాయి. ఎత్తు తగ్గించేస్తున్నారని.. బ్యారేజీ అయిపోయిందని కూడా రాసుకొచ్చారు.
ఇక, ఇదేసమయంలో అదానీకి చంద్రబాబు రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. అటు పక్షం ఇటు, ఇటు పక్షం అటు మారింది. విషయం మాత్రం అలానే ఉంది. దీనికి కారణం.. అధికారం దక్కించుకోవడం ఒకరి పక్షం, చేజారిన పక్షం ఇంకొకటి. కానీ, వాస్తవం మాత్రం.. ఎప్పుడూ జరిగేదే. అది కేంద్రం నిర్దేశించేదే. అన్ని రాష్ట్రాలకూ అప్పులు చేసుకునే వెసులు బాటు కేంద్రమే కల్పించింది. కాబట్టి అప్పుడైనా.. ఇప్పుడైనా అప్పులు తప్పవు.
అదానీకి ప్రాజెక్టులు అప్పగిస్తే.. మోడీ కళ్లలో ఆనందం కోసం .. ఆనాడు జగన్ వ్యవహరించారు. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ జరుగుతోంది. అలానే.. పోలవరం ఎత్తు విషయంలో వివాదం లేకుండా కేంద్రం చేసిన మధ్యే మార్గ నిర్ణయం ఎత్తు తగ్గింపు. తద్వారా.. ఒడిశా, తెలంగాణల నుంచి వస్తున్న వివాదాలకు చెక్ పెట్టింది. ఇది ఎప్పుడు జరిగినా.. కేంద్రం తీసుకున్న నిర్ణయానికే ఏపీ కట్టుబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయాలు సామాన్య ప్రజలకు తెలియదు. కానీ, రాజకీయంగా మాత్రం ఈ విషయాలు ఇరు పక్షాలకు ఆయుధాలుగానే మారాయి. అంతే తేడా..!