పవన్ రాజకీయం నేర్చుకుంటున్నారా ?

పవన్ పార్టీ పెట్టినప్పుడు నూతన ఒరవడితో రాజకీయాలు చేస్తామని ప్రకటించారు. అయితే అవి మిగిల్చిన చేదు అనుభవాలు ఆయన 2019 ఎన్నికల్లో చూశారు.

Update: 2024-12-07 19:30 GMT

అదేంటి పవన్ కి రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉంది కదా. ఆయన 2008లోనే ప్రజారాజ్యం పార్టీలో యువ రాజ్యం అధినేతగా కీలకంగా వ్యవహరించారు కదా అని అనొచ్చు. ఆయన మొత్తం రాజకీయ జీవితం 15 ఏళ్ళు పై మాటగా ఉందని ఆయన వరసగా నాలుగు సాధారణ ఎన్నికలను కూడా చూశారు అని కూడా చెప్పేవారు ఉన్నారు.

ఇక పొత్తులు ఎత్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలలో పవన్ ఎంతలా పండిపోయారన్నది కూడా అంతా బాగా విశ్లేషించి చెబుతారు. 2024 ఎన్నికలే అందుకు ఉదాహరణగా చూపిస్తారు. అటువంటి పవన్ ఇంకా రాజకీయాలు నేర్చుకుంటున్నారా అంటే అవును అనే ప్రచారం సాగుతోంది. అయితే పవన్ ఇపుడు నేర్చుకుంటున్నది ట్రెడిషనల్ పాలిటిక్స్ గురించి.

పవన్ పార్టీ పెట్టినప్పుడు నూతన ఒరవడితో రాజకీయాలు చేస్తామని ప్రకటించారు. అయితే అవి మిగిల్చిన చేదు అనుభవాలు ఆయన 2019 ఎన్నికల్లో చూశారు. అందుకే 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయన తన రాజకీయ పంధాను మార్చుకున్నారు. నాడు విమర్శించిన టీడీపీ బీజేపీలతోనే పొత్తు కలిపి ముందుకు సాగడం ఆయనలో వచిన గుణాత్మకమైన మార్పు అని చెబుతారు.

ఇక పవన్ తాను విశ్వ నరుడిని అని తాను అన్ని వర్గాల ప్రతినిధి అని తనకు పరిధిలు పరిమితులు లేవని కూడా అనేక సార్లు చెప్పారు. కానీ 2024 ఎన్నికల్లో ఆయన పార్టీ గెలవడానికి కారణం సామాజిక బలం అన్నది చాలా మందికి అర్థం అయిన విషయమే. ముఖ్యంగా గోదావరి జిల్లాలు విశాఖ వంటి చోట్ల జనసేనకు అనుకూల విజయాలు దక్కడం వెనక బలమైన సామాజిక వర్గం ఆ పార్టీని సొంతం చేసుకోవడమే అని కూడా విశ్లేషిస్తూంటారు.

కోస్తా జిల్లాలలో జనసేన ప్రభావం అంతకంతకు పెరుగుతోంది. దానికి కారణం కాపులు ఆ పార్టీకి వెన్ను దన్నుగా ఉండడమే. ఇందులో తప్పు ఏమీ లేదు. మిగిలిన పార్టీలకు కూడా ఆయా సామాజిక వర్గాలు దన్నుగా ఉన్నపుడు జనసేనకు ఎందుకు కాకూడదు అని కూడా అంటారు. అయితే పవన్ కూడా ఇపుడు అదే వైఖరిలో ఉంటూ తన పంధాను కొంత మార్చుకున్నారు అని అంటున్నారు.

కోస్తాలో జనసేన నెమ్మదిగా బలపడుతోంది. ఇక చూడాల్సింది రాయలసీమ వైపు అన్నది ఆయన కొద్ది నెలల క్రితమే ఆలోచించారు అని అంటున్నారు. అందుకే ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే ఏపీవ్యాప్తంగా గ్రామ సభలు ఒకే రోజున నిర్వహించాలని తన పంచాయతీ రాజ్ శాఖ ద్వారా పిలుపు ఇచ్చారు. అలా ఆయన రైల్వే కోడూరు నియోజకవర్గం వెళ్ళి అక్కడ గ్రామ సభలో పాలు పంచుకున్నారు.

ఆ విధంగా ఆయన సీమలో జనసేన ఉనికి బలంగా చాటే ప్రయత్నం చేశారు అని అంటున్నారు. ఇపుడు చూస్తే మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ కోసం ఆయన కడపను ఎంచుకున్నారు. సీమలో బలిజలు ఎక్కువగా ఉన్నారు. వారు చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రభావం చూపిస్తారు అని చెబుతారు.

ముఖ్యంగా కడప, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గాలలో బలిజలు బలంగా ఉన్నారు. వారే గెలుపోటములుని నిర్ణయిస్తూంటారు. ఈ సామాజిక వర్గం మొదటి నుంచి టీడీపీకి అండగా ఉంటోంది. వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు పవన్ రాయలసీమ మీద ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు.

ఈ విధంగా చేయడం ద్వారా రానున్న కాలంలో రాయలసీమలో జనసేన మరింతగా పటిష్టం చేసుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇక కుల రహిత రాజకీయం అని పవన్ మొదట్లో చెప్పినా రాజకీయాల్లో అయితే కులం పాత్ర కీలకం అవుతొంది. పైగా జనసేన విజయాల వెనక కూడా అది గట్టిగా పనిచేస్తోంది అని అంటున్నారు.

అందుకే పవన్ కూడా తన ఆలోచనలను ఆ దిశగా మార్చుకుంటున్నారా అన్న చర్చ వస్తోంది. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలలో అత్యధిక సంఖ్యలో ఉన్న బలిజలను కనుక జనసేన వైపు తిప్పుకుంటే తన రాజకీయనికి తిరుగు ఉండదని పవన్ భావిస్తున్నారని అంటున్నారు.

ఏది ఏమైనా పవన్ ట్రెడిషనల్ మార్క్ పాలిటిక్స్ ని నేర్చుకుంటున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఎవరెన్ని చెప్పినా ఈ దేశంలో కులాల పాత్ర రాజకీయాలో అతి ముఖ్యం. అందువల్ల జనసేనాని కూడా తన రధాన్ని ఆ వైపుగా నడిపిస్తున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News