వైసీపీలో ఆమంచి.. కార్నర్ అవుతున్నారే.. రీజనేంటి..?
ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు ఆయనకు పడేలా కనిపించడం లేదనే టాక్ ఆమంచి వర్గంలోనే వినిపిస్తోంది.
ఆమంచి కృష్ణమోహన్ కార్నర్ అవుతున్నారా? వైసీపీలో ఆయనకు వ్యతిరేక సెగ పెరుగుతోందా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఔననే అనే అంటున్నాయి. చీరాల కోసం పట్టుబట్టినా.. వైసీపీ అధిష్టా నం ఆయనను పరుచూరు నియోజకవర్గం ఇంచార్జ్‌గా నియమించింది. వచ్చే ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచే పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే.. స్థానికంగా ఆయన నేతలను తనవైపు తిప్పుకోవడంలో విఫలమవుతున్నారనే వాదన వినిపిస్తోంది.
ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు ఆయనకు పడేలా కనిపించడం లేదనే టాక్ ఆమంచి వర్గంలోనే వినిపిస్తోంది. ఇటీవల చినగంజాం మండలం పెదగంజాంలో మండల ఎంపీపీ కోమటిరెడ్డి అంకమ్మరెడ్డి ఆధ్వర్యంలో ఆమంచికి వ్యతిరేకరంగా సమావేశం నిర్వహించారు. అయితే.. ఇది అక్కడితో ఆగిపోలేదు. తాజాగా యద్దనపూడి ఎస్సీ కాలనీలో పార్టీ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాలెపోగు రాంబాబు కూడా ఇలాంటి సమావేశాలకే తెరదీశారు.
ఈ సమావేశాలకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు రావడం.. ఆమంచిపై తీవ్ర విమర్శలు చేయడం సంచలనంగా మారింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆమంచికి వ్యతిరేకంగా నాయకులు ధ్వజమెత్తుతున్నా రు. సీఎం జగన్ దళితుల పక్షపాతిగా ఉంటే, ఆమంచి మాత్రం ఎస్సీలను అణగదొక్కే చర్యలకు పూనుకున్నారని ఆరోపించడం గమనార్హం.
ఆమంచి చర్యలు పార్టీకి నష్టమని, ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించినట్లు తెలిసింది. మొత్తంగా ఈ పరిణామాలు.. ఆమంచికి సెగపెడుతున్నాయని ఆయన వర్గం చెబుతోంది. ఎన్నికలకుముందు అందరినీ కలుపుకొని పోయే వ్యూహాలు రెడీ చేసుకోవాలని.. అందరినీ ఆదరించే పద్దతిని అవలంభించాలని వారు సూచిస్తున్నారు. మరి ఆమంచి ఏం చేస్తారో చూడాలి.