బిత్తిరి సత్తి ఆ పార్టీలోకేనా?
ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఈటెల రాజేందర్ పై కేసీఆర్ కక్ష సాధిస్తున్నారని.. అందుకే తమ సామాజికవర్గానికి వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కేటాయించలేదని వారంతా ఆగ్రహంగా ఉన్నట్టు చెబుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు ఆయా పార్టీల్లో చేరికలు ఊపందుకుంటున్నాయి. సామాజికవర్గాల సమీకరణాల కోణంలోనూ ఆయా వర్గాల నేతలపై పార్టీలు వల విసురుతున్నాయి.
ముఖ్యంగా అధికార బీఆర్‌ఎస్ సామాజికవర్గాల కోణంలో నేతలపై దృష్టి పెట్టిందని సమాచారం. కేసీఆర్ ఇప్పటివరకు ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ముదిరాజ్ సామాజికవర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. తెలంగాణలో దాదాపు 60 లక్షల వరకు ముదిరాజులు ఉన్నారని చెబుతున్నారు. ఇంత సామాజికవర్గం ఉన్నా కేసీఆర్ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడంతో వారంతా కేసీఆర్ పై గుస్సాగా ఉన్నారని టాక్ నడుస్తోంది.
ఇటీవల ముదిరాజ్ లు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఆత్మగౌరవ సభలో కేసీఆర్ పైన దుమ్మెత్తి పోశారు. బీఆర్‌ఎస్ ముదిరాజులకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్ ముదిరాజ్ కమ్యూనిటీ నేతలపై దృష్టి పెట్టిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో బిత్తిరి సత్తిని బీఆర్‌ఎస్ లో చేర్చుకోవడానికి సిద్ధమైందని తెలుస్తోంది. బిత్తిరి సత్తి ముదిరాజ్ సామాజికవర్గానికి చెందినవారే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ లో కేటీఆర్ తో బిత్తిరి సత్తి సమావేశమయ్యారు. దీంతో ఆయన బీఆర్‌ఎస్ పార్టీలో చేరినట్టేనని అంటున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత మామిళ్ల రాజేందర్ కూడా బీఆర్‌ఎస్ లో చేరారు. ఆయన సైతం ముదిరాజ్ కమ్యూనిటీకి చెందినవారే.
ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఈటెల రాజేందర్ పై కేసీఆర్ కక్ష సాధిస్తున్నారని.. అందుకే తమ సామాజికవర్గానికి వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కేటాయించలేదని వారంతా ఆగ్రహంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారిని మచ్చిక చేసుకోవడానికి ఆ కమ్యూనిటీకి చెందిన నేతలపై బీఆర్‌ఎస్ వల విసురుతోందని అంటున్నారు.
ఇందులో భాగంగానే పలువురు ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నేతలతో చర్చించినట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ కూడా బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. ఇప్పటికే ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన అంబర్ పేట శంకర్, ఉద్యోగ సంఘాల నేత మామిళ్ల రాజేందర్ బీఆర్‌ఎస్ లో చేరారు.
ఇక ముదిరాజ్ సామాజికవర్గంలో మంచి పేరున్న నేతగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ పై బీఆర్‌ఎస్ వల విసిరిందని టాక్. తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడంతో బీఆర్‌ఎస్ లో చేరికకు కాసాని సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.