బీజేపీ ఇక్కడా తప్పుచేస్తోందా
రద్దుచేసిన 4 శాతం రిజర్వేషన్ను ఎన్నికల్లో లబ్దికోసమని లింగాయతులు, ఒక్కలిగలకు చెరో రెండుశాతం కేటాయించింది.
కర్నాటక ఎన్నికల్లో బీజేపీ చేసిన అనేక తప్పుల వల్ల నష్టపోయింది. పరిపాలనా పరమైన తప్పులకు తోడు ఎన్నికలకు ముందు తీసుకున్న మరో తప్పు కూడా బీజేపీ ఓటమికి ప్రధాన కారణమైంది. ఇంతకీ ఆ తప్పు ఏమిటంటే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ను రద్దుచేయటం. ఎప్పటినుండో ఉన్న ముస్లిం రిజర్వేషన్ను సరిగ్గా ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం రద్దుచేసింది. రద్దుచేసిన 4 శాతం రిజర్వేషన్ను ఎన్నికల్లో లబ్దికోసమని లింగాయతులు, ఒక్కలిగలకు చెరో రెండుశాతం కేటాయించింది.
బీజేపీ ఉద్దేశ్యం ఏమిటంటే ముస్లింలు ఓట్లేయకపోయినా లింగాయతులు, ఒక్కలిగలు ఓట్లేసి గెలిపిస్తారని. అయితే రిజర్వేషన్ రద్దుచేసినందుకు ముస్లింలు పూర్తి వ్యతిరేకమైపోయారు. అలాగే లింగాయతులు, ఒక్కలిగలు కూడా ఓట్లేయలేదు. దాంతో దారుణంగా బీజేపీ ఓడిపోయింది. తర్వాత జరిగిన సమీక్షల్లో ముస్లిం రిజర్వేషన్లు రద్దుచేయటం తప్పయిందని విశ్లేషించారు. సీన్ కట్ చేస్తే అదే తప్పు ఇపుడు తెలంగాణాలో కూడా రిపీట్ చేస్తున్నది బీజేపీ. ఇక్కడ అధికారంలో లేకపోయినా రావాలని అనుకుంటోంది.
మరలాంటపుడు అధికారంలోకి వస్తే వెంటనే ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ను రద్దు చేస్తామని ప్రకటించటం ఎందుకు ? తెలంగాణాలో ఏమీ బీజేపీకి ఓటుబ్యాంకు లేదు. ముస్లింలను దూరంగా పెడితే మిగిలిన సామాజికవర్గాలు పార్టీకి ఓట్లేస్తాయని అనుకునేందుకు ఒక్క సామాజికవర్గం మద్దతు కూడా లేదు. అలాంటపుడు అదికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తామని ఎన్నికలకు ముందే చెబితే ముస్లింల్లో ఎవరైనా ఎందుకు ఓట్లేస్తారు ? ఎలాగూ ముస్లింల ఓట్లు పడవు అనుకుంటే అసలా రిజర్వేషన్ రద్దు గోల ఇపుడెందుకు ?
అనవసరంగా దారినపోయే చెత్తను బీజేపీ తీసి నెత్తిన వేసుకున్నట్లుగా ఉంది. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అండ్ కో ఇదే విషయాన్ని పదేపదే ప్రకటిస్తున్నారు. వీళ్ళ ప్రకటన ముస్లింలకు ఒక హెచ్చరికగా అనిపిస్తోంది. తెలంగాణాలో ముస్లింల ఓట్లు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ముస్లిం సంఘాల లెక్కల ప్రకారం 60 నియోజకవర్గాల్లో ఎక్కువగానే ఉన్నయి. అయితే వివిధ పార్టీల అంచనాల ప్రకారం తక్కువలో తక్కువ 40 నియోజకవర్గాల్లో గణనీయంగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ముస్లింలను కెలుక్కోవటం బీజేపీకి అవసరమా