తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్... ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. పార్టీ అధికారం కోల్పోయింది. తర్వాత.. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాదు.. గుంపులు గుంపులుగా నే పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. కారణాలు ఏవైనా.. వారిని ఆపే ప్రయత్నం చేయడం లేదు. ఆగాలని వెళ్లిపోతున్నవారు కూడా కోరుకోవడం లేదు. వచ్చే రెండు మాసాల్లో బీఆర్ఎస్‌ను పూర్తిగా ఖాళీ చేయించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ కూడా అడుగులు వేస్తోంది. చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించుకుని సాధ్యమైనంత వరకు బీఆర్ ఎస్‌ను బుట్టదాఖలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలోనే వచ్చిన వారిని వచ్చినట్టు.. రానివారిని కూడా.. బుజ్జగించి మరీ పార్టీలోకి చేర్చుకునేట్టు సీఎం రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. దీనిని అడ్డుకోలేక.. కేసీఆర్ చేతులు ఎత్తేశారు. ఇక, ఈ పరిస్థితి ఇలా ఎన్నాళ్లు ఉంటుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇదిలావుంటే.. ఎమ్మెల్సీల పరిస్థితి కూడా అలానే ఉంది. ఇప్పటికే అరడజను మంచి మండలి సభ్యులు పార్టీ మారిపోయారు. ఇక, రేపో మాపో.. మరో నలుగురు రెడీగా ఉన్నారు. దీంతో బీఆర్ ఎస్ రాష్ట్రంలో దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. పోనీ.. పార్లమెంటులో అయినా గళం వినిపిస్తారా? అనేది ప్రశ్న.
పార్లమెంటు విషయాన్ని చూసుకుంటే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ బీఆర్ ఎస్ విజయం దక్కించుకున్న పరిస్థితి లేదు. కొన్ని స్థానాల్లో అయితే.. పరిస్థితి మరింత దారుణం.. భీకరం కూడా! డిపాజిట్లు కోల్పోయిన అభ్యర్థులు కూడా ఉన్నారు. దీంతో గడిచిన దశాబ్దానికి పైగా పార్లమెంటులో ముఖ్యంగా లోక్‌సభలో గళం వినిపించిన బీఆర్ ఎస్‌కు.. ఇప్పుడు ప్రాతి నిధ్యం లేకుండా పోయింది. ఒకప్పుడు.. కనీసం ఇద్దరైనా ఉన్న బీఆర్ ఎస్‌కు.. ఇప్పుడు ఒక్కరు కూడా లేని పరిస్థితి.. అసలు లోక్‌సభలో బీఆర్ ఎస్ కనిపించని పరిస్థితి నెలకొంది.
ఇక, ఇప్పుడు బీఆర్ ఎస్ అధినేత కు మరో చిక్కు వెంటాడుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ దెబ్బకు.. పార్టీ ఎమ్మెల్యే లు జంపైపోగా.. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి.. రాజ్యసభలో బలం లేదు. పైగా.. ఉన్న బలం కూడా.. మరో ఆరేడు మాసాల్లో తగ్గిపోతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీపే లవమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి తమకు అనుకూలంగా ఉన్నవారిని తీసుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేసినట్టు బీజేపీని జాగ్రత్తగా గమనిస్తున్నవారు చెబుతున్నారు.
ఈ క్రమంలో బీజేపీ పెద్దల తొలిచూపు.. బీఆర్ ఎస్ పైనే పడినట్టు ప్రచారంలో ఉంది. ప్రస్తుతం లోక్‌సభలో బీఆర్ఎస్‌కు ప్రాతినిధ్యం లేకపోయినా.. రాజ్యసభలో మాత్రం ఉంది.నలుగురు రాజ్యసభ సభ్యులు బీఆర్ ఎస్‌కు ఉన్నారు. వీరిలో బీ. పార్థసారథి రెడ్డి(2028), డి. దామోదర్ రావు(2028), కేఆర్ సురేష్ రెడ్డి(2026), వద్దిరాజు రవిచంద్ర(2030) ఉన్నారు. ఇప్పటికే ఉన్న కేకే.. పార్టీ మారిపోయారు. రాజ్యసభకు రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ ఎస్‌కు ఉన్న నలుగురిలో ఇద్దరు నుంచి ముగ్గురు వరకు తమ వైపు లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. నయానో.. భయానో.. వారిని లొంగదీసుకునే ప్రయత్నం చేయొచ్చు. దీని నుంచి తమ వారిని కాపాడుకునేందుకు కేసీఆర్ ఏమేరకు ప్రయత్నిస్తారో చూడాలి.