ఇజ్రాయెల్ శత్రుశేషం దాదాపు పూర్తైనట్లేనా... ఎవరీ సిన్వర్?

ఈ విషయాన్ని ఇజ్రాయెల్ విదేశాంగమంత్రి కాంట్జ్ ధృవీకరించారు.

Update: 2024-10-18 04:22 GMT

హమాస్ తో గాజాలో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ అతిపెద్ద విజయం సాధించింది. ఇందులో భాగంగా 2023 అక్టోబరు 7న జరిగిన దాడుల సూత్రధారి.. సుమారు 1,200 మంది ఇజ్రాయెలీయుల ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తి.. హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్ ను హతమార్చింది ఐడీఎఫ్. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ విదేశాంగమంత్రి కాంట్జ్ ధృవీకరించారు.

అవును... హమాస్ చీఫ్ సిన్వర్ ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హతమార్చింది. ఇది ఇజ్రాయెల్ కు అటు సైనికంగా, ఇటు నైతికంగా కూడా ఘనవిజయమని.. సిన్వర్ ఏరివేతతో బందీల విడుదలకు మార్గం సుగమం కానుందని జాంట్జ్ పేర్కొన్నారు. మరోపక్క.. సిన్వర్ ను హతమార్చి, లెక్కను సరిచేశామని.. అయితే యుద్ధం మాత్రం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ప్రకటించారు.

శత్రుశేషం దాదాపు పూర్తైనట్లే..!:

అక్టోబర్ 7 దాడుల తర్వాత గాజాపై యుద్ధం ప్రకటించినప్పుడే హమాస్ అగ్రనేతలందరినీ మట్టుపెడతామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. అన్నట్లుగానే... ఇప్పటికే హమాస్ రాజకీయ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఇస్మాయెల్ హనియోన్ను... మరో నెత మహ్మద్ డెయిఫ్ ను హతమార్చింది. ఈ క్రమంలోనే హమాస్ కు చెందిన దాదాపు కీలక కమాండర్లందరినీ చంపేసిందని అంటున్నారు.

ఇక ఇటీవల బీరుట్ లోని హెజ్ బొల్లా కార్యాలయంపై వైమానిక దాడులు నిర్వహించి ఆ సంస్థ అధినేత నస్రల్లాను హతమార్చింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలమే సృష్టించింది. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా హమాస్ అధినేత సిన్వర్ ని మట్టుబెట్టింది. దీంతో... ఇజ్రాయెల్ శత్రుశేషం దాదాపు పూర్తయినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

ఎవరీ సిన్వర్..?:

1962లో దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ లోని శరణార్థి శిబిరంలో జన్మించాడు సిన్వర్. అనంతరం ఇజ్రాయెల్ జైలులో సుమారు 22 సంవత్సరాలు గడిపాడు. ఈ క్రమంలో... ఇజ్రాయెల్ సైనిక మెదళ్ల గురించి, వారి భద్రతా వ్యవస్థల పనితీరు గురించి అవగాహన సంపాదించాడు. వాటిని తప్పించుకునే నైపుణ్యాన్ని కూడా సంపాదించాడని చెబుతారు.

2011లో గాజాలో కిడ్నాప్ చేయబడిన ఒక ఇజ్రాయెల్ సైనికుడి కోసం తనతో సహా ఇజ్రాయెల్ కస్టడీలో ఉన్న 1,027 మండి ఖైదీలను విడిపించడానికి సిన్వర్ చర్చలు జరిపాడు. అటు 22 ఏళ్ల జైలు జీవితం.. ఇటు గాజా శరణార్థి శిబిరాల్లో పేద బాల్యం వెరసి పాలాస్తీనా దేశం కోసం సిన్వార్ సంకల్పాన్ని ధృడ పరిచింది.

ఈ క్రమంలోనే గాజా నుంచి హమాస్ లోని తీవ్రవాద గ్రూపుకు యహ్యా సిన్వార్ నాయకత్వం వహించాడు. గాజా నుంచి ఇజ్రాయెల్ ను తొలగించేందుకు ఈ వర్గం హింసను ఆశ్రయించింది. ఈ ఏడాది జూలైలో హమాస్ రాజకీయ వ్యవహారాల అధిపతి ఇస్మాయెల్ హనియోన్ ను ఇజ్రాయెల్ హత్యచేయడంతో.. హమాస్ లో సిన్వర్ కు అని అధికారాలూ ఉన్నాయి.

తమదేశంపై అక్టోబర్ 7 దాడులకు 1,200 మందిని చంపడానికి ఆదేశించిన ఇతడిని కనుగొనడమే ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యం అయ్యింది. అయితే అది అంత ఈజీ కాదని ఇజ్రాయెల్ కు తెలుసు. అయితే అక్టోబర్ 16న రఫా నగరంలో మిలిటెంట్ల కదలికల నేపథ్యంలో ఇజ్రాయెల్ బలగాలు ఓ భవనంపై షెల్ ను ప్రయోగించాయి. ఆ భవనంలో సిన్వార్ ఉన్నాడు!

ఈ సమయంలో హమస్ పై ఇది కీలక విజయమని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ విజయం సాధించడంతో ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవ్ గ్యాలంట్ సైనికులకు సెల్యూట్ చేశారు.

Tags:    

Similar News