బీజేపీ గెలిచే సీట్లకు స్టాక్ మార్కెట్ కూ లింక్... కొత్త సర్వే న్యూస్!
ఇందులో భాగంగా ఇప్పటికే 6 దశల్లో పోలింగ్ పూర్తవ్వగా.. చివరి దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది.
ప్రస్తుతం భారతదేశంలో లోక్ సభ ఎన్నికల సందడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 6 దశల్లో పోలింగ్ పూర్తవ్వగా.. చివరి దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ సమయంలో "బీజేపీకి వచ్చే స్థానాలు - స్టాక్ మార్కెట్ పై దాని ప్రభావం" అంటూ ఒక సర్వే తెరపైకి వచ్చింది.
అవును... భారతీయ స్టాక్ లు తమ రికార్డు ర్యాలీని విస్తరించడానికి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (ఎన్డీయే కూటమి) 303 కంటే ఎక్కువ సీట్లు గెలవాలని చెబుతుంది బ్లూమ్ బర్గ్ సర్వే. 32 మంది అసెట్ మేనేజర్లు, వ్యూహకర్తలు, డీలర్ల అంచనా ప్రకారం.. బీజేపీకి తక్కువ మెజారిటీ వస్తే ఐ.ఎన్.ఎస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో 2% తగ్గడానికి దారితీయవచ్చని తెలిపింది!
ఇదే సమయంలో రూపాయి, సావరిన్ బాండ్లు కూడా తగ్గుతాయని అభిప్రాయపడింది. ఇదే క్రమంలో... 2019 ఎన్నికలలో పార్టీ సాధించిన 303 సీట్లకు మించి విజయం సాధిస్తే మాత్రం బెంచ్ మార్క్ స్టాక్ గేజ్ లో సుమారు 3% వృద్ధి సాధించొచ్చని సర్వే తెలిపింది. వాస్తవానికి పెట్టుబడిదారులు ఇప్పటికీ మోడీ మూడవసారి గెలవడానికి మద్దతు ఇస్తున్నారనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే... ఏప్రిల్ 19న తక్కువ ఓటింగ్ శాతం నమోదవ్వడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో గట్టి పోటీ నివేదికలు తెరపైకి రావడంతో... ఆశించిన మార్జిన్ బీజేపీ సాధిస్తుందా అనే చర్చా రాజకీయవర్గాల్లో నడుస్తుంది. ఈ సమయంలో మోడీ గెలవకపోతే అది కొంత అనిశ్చితిని సృష్టిస్తుందని.. నిపుణులు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు.
వాస్తవానికి జూన్ 4న విడుదలయ్యే ఎన్నికల ఫలితాలకు రెండు నెలల ముందే కరెన్సీ, బాండ్ మార్కెట్లు గరిష్ట స్థాయికి చేరుకోగా.. భారతీయ ఈక్విటీలు రికార్డులకు చేరుకున్నాయి. మరోపక్క గ్లోబల్ ఫండ్స్ ఈ నెలలో స్థానిక షేర్ల నుండి $2.9 బిలియన్లను వెనక్కి తీసుకున్నాయి.
అయినప్పటికీ.. బీజేపీ దాని మిత్రపక్షాలు 400 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామనే తన వాగ్దానాన్ని నెరవేర్చినట్లయితే స్టాక్ బెంచ్ మార్క్ లు కనీసం 20% ర్యాలీని కలిగి ఉంటాయని కొంతమంది భాగస్వాములు అంచనా వేస్తున్నారట. కాగా... బీజేపీ 300 సీట్ల వరకూ గెలుచుకోవచ్చంటూ పలు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాస్తవ ఫలితాల కోసం జూన్ 4 వరకూ వేచి చూడాలి!