వెయ్యేళ్ల 'హిస్టరీ' కూలిపోతోంది.. ఇటలీలో హై అలర్ట్
ఇటలీ దేశంలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇక్కడి గరిసెండా టవర్స్ ఏక్షణమైనా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి
ఇటలీ దేశంలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇక్కడి గరిసెండా టవర్స్ ఏక్షణమైనా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించడం గమనార్హం. ఇటలీ పట్టణంలో 150 అడుగుల పొడవున్న ఈ టవర్ కూలిపోయే ప్రమాదం ఉందని దానిని పర్యవేక్షిస్తున్న శాస్త్రీయ కమిటీ వెల్లడించింది. పురాతన ఈ టవర్ కొన భాగంలో బరువు ఎక్కువగా ఉండటం వల్ల 14వ శతాబ్ద కాలంలో ఇది దాదాపు 4 డిగ్రీల మేర వంగిపోయింది. దానిని యధాస్థితికి తీసుకొచ్చేందుకు అప్పట్లో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఇక, అప్పటి నుంచి ఈ టవర్ వంగి ఉండటంతో దీనిని 'లీనింగ్ టవర్'గా పిలవడం ప్రారంభించారు. తాజాగా, ఈ టవర్ మరింత వంగినట్లు నిపుణులు గుర్తించారు. దీంతో ఏ క్షణంలోనైనా అది కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఇటలీ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా నగరం నగరాన్నే ఖాళీ చేయించారు. ఒకవేళ కూలినా.. ఆ శిథిలాలు చుట్టుపక్కల ఇళ్లపై పడకుండా టవర్ పొడవుతో ఇనుప జాలిని అమర్చారు. అటువైపు వెళ్లేందుకు ప్రజలకు అనుమతి నిషేధించారు.
టవర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 2019లో శాస్త్రీయ కమిటీ సెన్సార్లను అమర్చారు. తొలిసారిగా అక్టోబరులో సెన్సార్లు ప్రమాద ఘంటికలు మోగించాయి. దీనిపై పరిశోధన చేసిన శాస్త్రీయ బృందం టవర్ పరిస్థితి ప్రమాదంలో పడిందని, అది ఏక్షణంలోనైనా కూలిపోవచ్చని తాజాగా తేల్చింది. మరోవైపు ప్రపంచ ప్రసిద్ధి చెందిన పీసా టవర్ 5 డిగ్రీల మేర వంగి ఉంటుంది. ఇది కూడా ఇటలీలోనే ఉంది. ఇదిలావుంటే.. లీనింగ్ టవర్స్‌ను చూసేందుకు ఏటా కోట్ల మంది పర్యాటకు ఇటలీకి వస్తున్నారు. దీంతో ఆ దేశానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇప్పుడు కూలిపోతున్న దశలోనూ టవర్స్‌కు క్రేజ్ తగ్గలేదని అధికారులు పేర్కొనడం గమనార్హం.