కేంద్రం నుంచి ఏపీకి క్యూ కడుతున్న అధికారులు
ఇప్పటికే పలువురు అధికారుల్ని కేంద్రం నుంచి ఏపీకి తెప్పించుకున్న చంద్రబాబు సర్కారు.. తాజాగా మరికొందరిని కూడా తీసుకొస్తోంది.
ప్రభుత్వం మారినంతనే.. అందుకు తగ్గట్లుగా అధికారుల ఎంపిక జరుగుతుండటం తెలిసిందే. ఏపీలో జరిగిన అధికార బదిలీ నేపథ్యంలో గతంలో కేంద్ర సర్వీసులకు వెళ్లిన పలువురు ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఏపీకి తిరిగి వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు అధికారుల్ని కేంద్రం నుంచి ఏపీకి తెప్పించుకున్న చంద్రబాబు సర్కారు.. తాజాగా మరికొందరిని కూడా తీసుకొస్తోంది.
త్వరలో ఉత్తరప్రదేవ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి ఎ.వి. రాజమౌళిని ఏపీకి తీసుకొస్తున్న ప్రభుత్వం.. ఆయన్ను ఏపీకి పంపాలని కేంద్రాన్ని కోరింది. దీంతో.. ఆయన్ను డిప్యూటేషన్ మీద పంపేందుకు కేంద్రం ఓకే చెప్పింది. 2014-19 మధ్యన ఏపీ సీఎంలో పని చేసిన రాజమౌళి.. ప్రస్తుతం యూపీ హోం శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. జనసేనాని ఏరి కోరి మరీ కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి క్రిష్ణ తేజను ఏపీకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.
ఆయన్ను ఏపీకి డిప్యుటేషన్ మీద పంపేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ప్రత్యేక సలహాదారుగా.. ఆయనకు కేటాయించిన మంత్రిత్వ శాఖల విషయంలో ఆయన కీలకభూమిక పోషిస్తారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో ఐపీఎస్ అధికారి కూడా ఏపీకి వస్తున్నారు.
ప్రస్తుతం కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న ఆకే రవిక్రిష్ణను కూడా ఏపీకి తీసుకొస్తున్నారు. గతంలో కర్నూలు ఎస్పీగా పని చేసిన వేళలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. నీతిగా.. నిజాయితీగా వ్యవహరించే ఆయన 2006 బ్యాచ్ కు చెందిన వారు. మరోవైపు.. తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా 2005 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరిని నియమించారు. ఈయన కూడా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కోరటంతో ఆయన్ను.. మూడేళ్లు ఏపీకి డిప్యూటేషన్ మీద పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ను.. టీటీడీ జేఈవోగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా.. కీలకమైన స్థానాలకు కేంద్రం అనుమతితో పలువురు అధికారుల్ని ఏపీకి తీసుకొస్తున్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి. రాబోయే రోజుల్లో ఇంకొందరు అధికారులు వచ్చే వీలుందని చెబుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వంలోనూ పలువురు అధికారుల్ని కేంద్రం అనుమతితో డిప్యుటేషన్ మీద ఏపీకి తీసుకురావటం తెలిసిందే. అలా వచ్చిన వారిలో 8 మందిని రిలీవ్ కాకుండా చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే ఉత్తర్వులు జారీ చేయటమే కాదు.. వారి మీద ప్రత్యేక ఫోకస్ చేయటం గమనార్హం. మరోవైపు.. డిప్యుటేషన్ మీద రాష్ట్రానికి వచ్చిన.. వస్తున్న అధికారులు రాబోయే రోజుల్లో తమ మార్కును ఏ రీతిలో వేస్తారన్నది ఆసక్తికరంగా చెప్పక తప్పదు.