జగన్ ఆశీస్సులతో గిద్దలూరు నుంచి పోటీ చేస్తా - ఐవీ రెడ్డి

ఈ నియోజకవర్గాన్ని ఏపీలోనే రోల్ మోడల్ గా డెవలప్మెంట్ లో చూపిస్తామని అంటున్నరు వైసీపీ సీనియర్ నేత ఐవీ రెడ్డి.

Update: 2023-08-18 17:11 GMT

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నియోజకవర్గం ఒక ప్రత్యేకమైనది. పూర్తిగా డ్రై ఏరియాతో నిండినది. అత్యంత వెనకబడినది. ఈ నియోజకవర్గాన్ని ఏపీలోనే రోల్ మోడల్ గా డెవలప్మెంట్ లో చూపిస్తామని అంటున్నరు వైసీపీ సీనియర్ నేత ఐవీ రెడ్డి. ఆయన తాజాగా ఒక యూ ట్యూబ్ చానల్ కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో అనేక విషయాలను ప్రస్తావించారు.

తనకు 2019లో టికెట్ జస్ట్ లో మిస్ అయిందని, ఈసారి గ్యారంటీగా వస్తుందని నమ్ముతున్నానని అన్నారు జగన్ ఆశీస్సులు వైసీపీలో పెద్ద నాయకుల మద్దతుతో ప్రజల ఆశీర్వాద బలంతో తనకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే చాన్స్ దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయన వ్యక్తిగత జీవితం రాజకీయ ప్రస్థానం గురించిన విషయాలను కూడా తెలియచేశారు. గిద్దలూరు మండలం లోని క్రిష్ణం రెడ్డి పల్లె ఐవీ రెడ్డి సొంత ఊరు. అది గిద్దలూరికి మూడు కొలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ తాను పదవ తరగతి వరకూ చదివాను అని ఆయన వెల్లడించారు. ఆ తరువాత ఇంటర్ ఒంగోలులో, ఆ మీదట ఇంజనీరింగ్ బళ్ళారిలో చదివాను అని చెప్పారు. ఇక అక్కడ నుంచి హైదరబాద్ టూ అమెరికా తన ప్రయాణంగా చెప్పారు.

గిద్దలూరి అభివృద్ధి నా ఆకాంక్ష అని ఆయన వెల్లడించారు. తాను అమెరికాలో సాఫ్ట్ వేర్ బిజినెస్ లో ఉన్నానని, అయితే తన సొంత ప్రాంతం అభివృద్ధి మీద మక్కువ ఉందని అన్నారు. ఇక రాజకీయంగా చూస్తే నా కుటుంబంలో ఎవరూ లేరు నా సొంత సోదరి జెడ్పీటీసీ పోటీ చేశారని చెప్పారు. ఇక తనకు 2019లోనే సీటు రావాలని, కానీ చివరి నిముషంలో దక్కలేదని ఆయన అన్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయని, అలాగే, సామాజిక వర్గాల సమీకరణ నేపధ్యంలో మిస్ అయిందని పేర్కొన్నారు.

ఇక తాను పార్టీ కష్టాలలో ఉన్నపుడు గిద్దలూరు వైసీపీ ఇంచార్జిగా ఎవరూ తీసుకోవడానికి ధైర్యం చేయలేనపుడు కీలక బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు. ఇక ఆ రోజు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ అంతా టీడీపీలోకి పోయారు. వైసీపీకి ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఒక సర్పంచు మాత్రమే మిగిలారని ఆయన అన్నారు. అయినా కూడా తాను ఎక్కడా నిరాశ పడకుండా గడప గడపకూ వెళ్లానని, అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తప్పులను ప్రజల దగ్గరకు తీసుకెళ్ళి చెప్పానని, అలాగే, ఆ ప్రభుత్వం చేసే అరాచకాలు అవినీతి గురించి చెప్పానని అన్నారు. ఇక వైఎస్ జగన్ని ఎందుకు ఎన్నుకోవాలన్న దాని మీద కూడా ప్రజలకు చెప్పానని అన్నారు.

ఇక గిద్దలూరు బాగా వెనకబడిన నియోజకవర్గమని అన్నారు. గతంలో నంద్యాల లోక్ సభ పరిధిలో ఉన్నామని,ఇపుడు ఒంగోలులోకి వచ్చామని చెప్పారు. ఏది చూసుకున్నా గిద్దలూరు అటూ ఇటూ కాకుండా అయిందని ఐవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గిద్దలూరుకు సహజ వనరులు లేవు. అంతా డ్రై లాండ్స్. బోర్ల మీద ఆధారం, సాగు నీరు తాగు నీరే ఇబ్బంది, తాను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని, ఎడ్యుకేషన్, జాబ్స్ అన్నీ చూడాలి, ఆర్ధికంగా ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటూ ఆయన వివరించారు.

ఇక గిద్దలూరు ప్రత్యేకతను కూడా చెప్పారు. ఈ దేశం నుంచి సైన్యంలో అన్ని బెటాలియన్స్ లో ఎక్కువగా గిద్దలూరు యువతే ఉంటారని అన్నారు. ఎందుకంటే ఇక్కడ అవకాశాలు లేవు ఉపాధి కోసం యువత ఆర్మీలోనే ఎక్కువగా చేరుతోందని అన్నారు. ఇక గిద్దలూరులో ఒక్క ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల లేదని, ఎవరూ పట్టించుకోలేదని అన్నారు.

ఇక తాను వైసీపీ ఇంచార్జిగా ఉన్నపుడు తానే సొంతంగా వాటర్ ట్యాంకర్స్ పెట్టాను. ఆరు మండలాలలో అన్ని పంచాయతీలో తిరిగాను, సామాజిక వర్గం పరంగా కానీ ఏ సమస్య ఎక్కడ ఉందన్నది తనకు బాగా తెలుసు అని ఆయన అన్నారు. అలాగే, తాను నిరంతరం ప్రజలతోనే తిరుగుతున్నానని, ప్రజలకు ఏమి అవసరం అన్నది సర్వే ద్వారా డేటా అంతా తన దగ్గర ఉందని ఐవీ రెడ్డి వెల్లడించారు.

ఇక తనకు ఒక అవకాశం వస్తే ప్రభుత్వంతో పాటు సొంతంగా కూడా నిధులు వెచ్చించి తన నా సన్నిహితుల సాయంతో ఎంతో చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక వైసీపీ ఇంచార్జిగా ఉన్నపుడు వైఎస్సార్ కి నివాళిగా రక్త శిబిరాలు ఏర్పాటు చేశామని, అలాగే వేలాదిగా కుటుంబాలను వైసీపీలో చేర్చి పార్టీని బలోపేతం చేశామని ఆయన గుర్తు చేశారు.

ఇదిలా ఉంటే తాను ఎన్నారైగా ఉన్నా తన తల్లిదండ్రులు బంధువులు అంతా గిద్దలూరులోనే ఉన్నారని, తన సొంత నేల గిద్దలూరు అని ఆయన అన్నారు. తాను గిద్దలూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని కూడా వివరించారు. ఆ రోజున ఉన్న వైసీపీ ఎమ్మెల్యే టీడీపీకి జంప్ అయిన తరువాత అమెరికా లో ఉన్న తనకు పిలిచి మరీ గిద్దలూరు వైసీపీ ఇంచార్జిగా ఇచ్చారని చెప్పారు. దాంతో నేను అప్పట్లో బాగా తిరిగాను, బిజినెస్ అన్నీ పక్కన పెట్టి నేను ఎన్నికల వరకూ పనిచేశా. వైసీపీ మెజారిటీ వచ్చినంత వరకూ పనిచేశాను అని ఆయన వివరించారు.

ఆ మీదట సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారని, కాబట్టి డిస్టర్బ్ చేయరాదు అని భావించే నేను అలా దూరంగా ఉన్నానని, అంతే తప్ప తనకు గిద్దలూరుతో విడదీయని బంధం ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికీ అందరికీ టచ్ లో ఉంటున్నానని అన్నారు. ఈ విషయం పబ్లిక్ తెలియకపోవచ్చునని అన్నరు. ఇక తాను ఎవరికి ఏ పని ఉన్నా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంకా పార్టీ లో పెద్దల ద్వారా చేయించానని చెప్పారు. అలాగే ఇటీవల తాను వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డిని, మాజీ మంత్రి బాలినేనిని మర్యాదపూర్వకంగా కలిశానన్ని అన్నారు. తాను కూడా ఆశావాహుణ్ణి కాబట్టి టికీట్ ఆశించడంలో తప్పులేదని ఆయన అన్నారు.

ఇక జగన్ ఆశీస్సులతో నాకు టికెట్ వస్తుంది అని ఆశిస్తున్నానని చెప్పారు. అలాగే ఏపీలో మోడల్ డెవలప్మెంట్ నియోజకవర్గంగా గిద్దలూర్ ని తీర్చిదిద్దుతానని ఐవీ రెడ్డి చెప్పారు. తనకి గిద్దలూరులోనే ఇల్లు, పొలం, ఆధార్ కార్డు, బంధుత్వం, అన్నీ ఉన్నాయని, అలాగే, సమస్యల మీద పూర్తి అవగాహన ఉందని అన్నారు. నా ఆర్ధిక విషయాలతో వేరే చోట ఉండవచ్చు కానీ అలా సంపాదించిన మొత్తాన్ని గిద్దలూరుకే ఖర్చు చేస్తున్నాను అని ఆయన చెప్పారు. తాను పక్కా లోకల్ అని ఐవీ రెడ్డి తెలిపారు.

ఇక తాను వైసీపీ వారికి చెప్పేది ఒక్కటే. లోకల్ గా ఉన్న వారిని ఎన్నుకోవాలని అపుడే ఈ నియోజకవర్గం బాగుపడుతుందని అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే గిద్దలూరులో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయని అందరూ ఓటేస్తేనే ఎవరైనా గెలుస్తారని అన్నారు. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే తనకే మళ్ళీ టికెట్ అని ప్రచారం చేసుకున్నా వైసీపీ రీజనల్ పార్టీ. ఎంత పెద్ద వ్యక్తి అయినా జగన్ ఆశీస్సులతోనే టికెట్. జగన్ బీ ఫారం ఇస్తారు, సర్వేలు, ప్రజాదరణ చూసే టికెట్ ఇస్తారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఎవరు చేసుకున్నా అసలు కుదరదని ఆయన స్పష్టం చేశారు

ఇక గిద్దలూరులో చూస్తే ఎమ్మెల్యే ఒక సామజికవర్గాన్ని దూరం చేస్తున్నారు అన్న భావన ఉందని, అలాగే . రెడ్డిలను టార్గెట్ చేస్తున్నారు ప్రచారంలో ఉందని అన్నారు. ఇక గిద్దలూర్ టౌన్, రూరల్ లలో గుల్లమూడి ప్రాజెక్ట్ ఉందని, దాన్ని మధ్య తరహా ప్రాజెక్ట్ కూడా చేయాలి. దాని వల్ల సమస్య పరిష్కారం వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా మిగిలిన మండలాలకు లబ్ది కలుగుతుందని అన్నారు.

అలాగే, వైసీపీ నవరత్నాల పాలసీల మీద వెళ్తోంది. రెండు లక్షల 31 వేల కోట్లు చేశారు. అయిదేళ్ళకు మూడు లక్షల కోట్లు అవుతుంది. ఇదంతా గుండె ధైర్యంతో జగన్ చేస్తున్నరు. అని చెప్పారు. అవినీతి లేదు. 99 శాతానికి పధకాలు అందుతున్నాయని అన్నారు. ఇక గిద్దలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుంది. మెజరిటీ అటూ ఇటూ అయినా గెలుపు గ్యారంటీ. గతంలో నేను సపోర్ట్ చేశా. నాకు ఎమ్మెల్యే సీటు వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే కూడా మానవతా దృక్పధంతో చేస్తారని ఆశిస్తున్నట్లుగా చెప్పారు.

ఇక వైసీపీలో అభ్యర్ధి మార్పు అయితే జరుగుతుందని అన్నారు. ఇక టీడీపీ జనసేనతో పొత్తు ఉన్నా కూడా వైసీపీదే విజయం అని ఆయన అన్నారు గిద్దలూరులో వరదలు విషయంలో నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మునిసిపాలిటీ వరకూ మేజర్ సమస్యగా ఉందని అన్నారు. సగిలేరు నుంచి వచ్చే వరద నీరుని ఆపేందుకు వరద నీరు రాకుండా రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే ఎమ్మెల్యేగా గెలిస్తే తనకు ఒక అజెండా ఉందని అన్నారు.

గిద్దలూర్ కి తాగు నీరు, సాగునీరు. డ్రై ఏరియా. యువతకు ఉపాధి బాధ్యత నాదే, రెండేళ్లలోనే అన్ని ఫీల్డ్స్ లో పదివేల ఉద్యోగాలు ఐటీఐ, డిప్లమా, ఫార్మా , డిగ్రీ ఇలా నూరు శాతం ఇప్పిస్తాను. ప్రతీ మండలంలో క్రీడా ప్రాంగణం పార్క్, గ్రామాల్లో పంచాయతీలలో ఉన్నాయి. పంచాయతీలతో కో ఆర్డినేట్ చేసుకుని అంతా చేస్తామని ఐవీ రెడ్డి చెప్పారు.

ఇక తాను ఎమ్మెల్యే అయిన తరువాత మొదటి చర్యగా సాగు నీరు, తాగు నీరు సదుపాయం ఉంటుందని, రెండవ చర్యగా యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయని అన్నారు. అదే విధంగా గిద్దలూరులో పరిశ్రమల ఏర్పాటుకు కూడా యాక్షన్ ప్లాన్ ఉందని అన్నారు. అక్కడ టమాటా మిర్చీ పండించే రైతులు ఉన్నారు. కొన్ని సీజనలో కనీస మద్దతు ధర వస్తుంది. చాలా సార్లు మద్దతు ధర రాదు, అపుడు పంట బయటపడేస్తున్నరు.

అలా కాకుండా చూడాలని అన్నారు. మదనపల్లిలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ. అలాంటిది ఓకటి గిద్దలూరుకి తీసుకుని వస్తాం, పేపర్ ఇండస్ట్రీని మేజర్ ప్రాజెక్ట్ గా తీసుకుని వచ్చి అయిదు వేల మందికి ఉపాధి కల్పిస్తామని అన్నారు. ఇక తాను ఎమ్మెల్యే అయితేనే ప్రజలకు ఎక్కువగా చేయగలనని అన్నారు. ప్రభుత్వంలో ఉంటేనే అన్నీ అవుతాయి. సొంతంగా అయితే అయిదు శాతం కంటే ఎక్కువగా చేయలేమని పేర్కొన్నారు. మొత్తం మీద ఐవీ రెడ్డి తనకు నూరు శాతం గిద్దలూరు టికెట్ వస్తుందని, అంతే శాతంతో గెలుస్తానని వైసీపీ ప్రభుత్వంలో గిద్దలూరుని ఏపీలో నంబర్ వన్ చేస్తామని గట్టి భరోసాతో చెప్పుకొచ్చారు.


Full View


Tags:    

Similar News