తిరుమల లడ్డూపై ఐవైఆర్‌ సంచలన వ్యాఖ్యలు!

తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఐవైఆర్‌ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-20 10:00 GMT

తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఐవైఆర్‌ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబే అభియోగాలు మోపారంటే దీని గురించి ఇప్పటికే కొంత విచారణ జరిగి ఉండాలి. అలాగే ఆధారాలు సేకరించి ఉండాలి. ఈ విధంగా వ్యవహరించిన వారికి ఘోరమైన శిక్ష పడేవిధంగా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టాలి. మిగిలిన ఆరోపణలన్నీ ఒక ఎత్తు.. ఇది ఒకటి ఇంకొక ఎత్తు’’ అని ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

‘‘ కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా చొరవ తీసుకొని దీనిపై సమగ్ర విచారణ జరపాలి. అవసరమైతే ప్రత్యేక చట్టం తెచ్చి నిందితులకు కఠిన శిక్ష పడే దశగా కార్యాచరణ రూపొందించాలి. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి’’ అని ఐవైఆర్‌ కృష్ణారావు కోరారు.

అలాగే యూట్యూబ్‌ చానెల్‌ లో మాట్లాడుతూ తిరుమల లడ్డూలో కల్తీ జరిగి ఉంటుందని తాను అనుకోవడం లేదని ఐవైఆర్‌ కృష్ణారావు తెలిపారు. అయితే స్వయంగా సీఎం స్థాయి వ్యక్తే ఆరోపిస్తున్నారు కాబట్టి దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు చెప్పింది తప్పని తేలితే ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.

మరోవైపు, తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువులు కొవ్వులు కలిపారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్‌ తీవ్రంగా ఖండించింది. చంద్రబాబు వ్యాఖ్యలు బా«ధాకరమని అభివర్ణించింది. ఈ ఆరోపణలు ఆయన చేస్తున్నారు కాబట్టే వాటిని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే ఉందని తెలిపింది.

తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వులు కలిశాయంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆవేదన కలిగించిందని విశ్వహిందూ పరిషత్‌ వెల్లడించింది. ఈ వ్యవహారంలో నిజనిర్దారణ జరగకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లడ్డు అపవిత్రం అయ్యిందని చెప్పడం సరికాదని అభిప్రాయపడింది. దీక్షలు చేపట్టే భక్తులు తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకుంటారని.. ఈ నేపథ్యంలో లడ్డులో జంతువుల కొవ్వు కలిసి ఉందని ఆధారాలు లేకుండా చెప్పడం సరికాదని స్పష్టం చేసింది.

Tags:    

Similar News