రోజుకో యాంటీ న్యూస్‌.. జ‌గ‌న్ శిబిరం ఏం చేస్తోంది.. !

టిడిపికి మద్దతు పలికే మీడియా జగన్మోహన్ రెడ్డిని నిత్యం వ్యతిరేకిస్తూ ఏదో ఒక ప్రధాన వార్తను ప్రచారం చేస్తూనే ఉంది.

Update: 2024-08-27 19:30 GMT

వైసీపీ అధికారం కోల్పోయి దాదాపు మూడు నెలలు అవుతుంది. అయినప్పటికీ వైసీపీ గత పాలనపై అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తీరుపై ఇప్పటికి ప్రతిరోజు వ్యతిరేక వార్తలు వస్తూనే ఉన్నాయి. టిడిపికి మద్దతు పలికే మీడియా జగన్మోహన్ రెడ్డిని నిత్యం వ్యతిరేకిస్తూ ఏదో ఒక ప్రధాన వార్తను ప్రచారం చేస్తూనే ఉంది. అయితే వీటికి కౌంటర్ ఇవ్వడంలోను తమ పాల‌న‌లో ఏం జరిగిందో చెప్పడంలోనూ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సహా ఆయన పరివారం పూర్తిగా విఫలం అవుతుంది.

తాజాగా ప్రభుత్వ స్కూళ్లలో వైసిపి అధినేత తీసుకువచ్చిన సీబీఎస్ఈ సిలబస్ పై రెండు ప్రధాన పత్రికలు వార్త‌లు రాశాయి. సీబీఎస్ఈ సిలబస్ విఫలమైపోయిందని జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన నిర్ణయం దారుణమని పెద్ద ఎత్తున వార్తలు రాసుకొచ్చారు. కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంటుంది. సిబిఎస్ సిలబస్ అనేది ప్రస్తుతం ప్రైవేటు స్కూల్లో బాగా అవలంబిస్తున్న విధానం. ఎందుకంటే సిబిఎస్సి సిలబస్ ద్వారా జాతీయస్థాయిలోను అలాగే అంతర్జాతీయ స్థాయిలోనూ అవకాశాలు తెచ్చి పెడుతుంది.

ఉన్నత విద్యను చదువుకునేందుకు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు కూడా తమ పిల్లలను కేవలం సిబిఎస్సి సిలబస్ కోసమే ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ప్రభుత్వ పాఠశాలలో కూడా సీబీఎస్సీ సిలబస్ అమలు చేయాలని సంకల్పించుకుని ఆ దిశగా అడుగులు వేశారు. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది.

సాధారణంగా ఒక విత్తనం నాటిన తర్వాత అది మొక్కై తర్వాత ఫలాలు ఇచ్చేందుకు ఎలాగైతే సంవత్సరాలు తరబడి సమయం పడుతుందో ప్రభుత్వ స్కూళ్లల్లో చేసిన ఈ సీబీఎస్ఈ ప్రయోగం ఏదైతే ఉందో అది కూడా అంతే సమయం పడుతుంది. ఇది అందరికి తెలిసిన విషయం. ఒక సంస్కరణ తీసుకువచ్చినప్పుడు ఫలితాలు ఇవ్వడానికి కొంత సమయం పట్టినట్టే సీబీఎస్ఈ సిలబస్ కూడా పడుతుందనేది అందరికీ తెలుసు. అయినా కూడా జగన్ ఏదో తప్పు చేశాడని జగన్ లేనిపోని సిలబస్‌ను తీసుకువచ్చి విద్యార్థులపై రుద్దాడ‌ని ప్రచారం జరుగుతోంది.

కానీ ఇది వాస్తవం కాదు. ఈ విషయం వైసిపి నాయకులకు తెలిసిన దీనిని ఎందుకు ఖండించలేకపో తున్నారో ఈ వ్యతిరేక‌ వార్తలపై ఎందుకు చూసిచూన్నట్టు వదిలేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎన్నికలకు ముందు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విష‌యంలో ఇలాగే చేశారు. కానీ ఇప్పుడు అదే లాండ్‌ టైటిలింగ్ వేరే రూపంలో తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తోంది. ఇది అందరికీ తెలియకపోయినా అంతర్గతంగా జరుగుతున్న చర్చ.

ఒకవైపు రిసర్వే జరుగుతోంది రీ సర్వే ప్రధాన లక్ష్యం ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ తీసుకురావడం. మరి లాండ్‌ టైటిలింగ్‌ రద్దు చేసినటువంటి ప్రభుత్వం రీ సర్వేను ఎందుకు కొనసాగిస్తుంది. అన్నదానికి సమాధానం లేదు. అంటే దీనిని బట్టి వేరే రూపంలో చ‌ట్టం తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల వ్యవహారం కూడా తీవ్రమైన వ్యతిరేకతతో కూడిన వార్తలతో నిండిపోతోంది. స్మార్ట్ మీటర్లు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం. దీన్ని జగన్ అందిపుచ్చుకున్నారు.

దీనిని రద్దు చేయాలని చంద్రబాబుకు ఉన్నప్పటికీ దీనివల్ల ఫలితాలు ఉంటాయి కాబట్టే ఆయన చూసి చుడ‌న‌ట్టు వదిలేశారు. కానీ, దీనిని కూడా వ్యతిరేకంగా చూపిస్తూ జగన్ పై విషం చిమ్ముతున్న ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ప్రయత్నాలను వైసిపి నాయకులు ఎందుకు చూసి చూడ‌న‌ట్టే వ్యవహరిస్తున్నారు. ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. అనేది ఆత్మమర్శ చేసుకోవాలి. ఎన్నికలకు ముందు ఏదైతే మౌనం వారిని నష్టపరిచిందో ఇప్పుడు కూడా అదే మౌనం పాటిస్తుండడం మరింత దారుణంగా ఉంది.

Tags:    

Similar News