బాబాయ్ ప్లేస్ లో బొత్స...జగన్ మార్క్ !
ఉత్తరాంధ్రలో వైసీపీకి పరువు పోయింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఏ మాత్రం అయిన పరువు దక్కించింది అంటే అది అరకు ప్రాంతమే
ఉత్తరాంధ్రలో వైసీపీకి పరువు పోయింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఏ మాత్రం అయిన పరువు దక్కించింది అంటే అది అరకు ప్రాంతమే. అరకు ఎంపీ, అరకు, పాడేరు ఎమ్మెల్యే సీట్లను వైసీపీ గెలుచుకుంది. లేకపోతే ఆ ఉన్న పరపతి కూడా పోయేది.
ఇక వైసీపీకి ఉత్తరాంధ్రాలో విజయాలు చేకూర్చింది విజయసాయిరెడ్డి. ఆయన రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉండగానే 2019 ఎన్నికల్లో వైసీపీ ఉత్తరాంధ్ర మొత్తం మీద 34 అసెంబ్లీ సీట్లకు గానూ 28 సీట్లను గెలుచుకుంది. అలాగే అయిదు ఎంపీ సీట్లలో నాలుగు గెలుచుకుని గ్రేట్ అనిపించుకుంది. విశాఖ ఎంపీ, విశాఖ మేయర్ సీటు కూడా వైసీపీ అపుడే గెలుచుకుంది.
ఇలా గతమంతా వైభవంగా ఉంటే వైవీ సుబ్బారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించాక వైసీపీకి అన్నీ పరాజయాలే ఎదురు అయ్యాయి. వైసీపీకి 2023లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు ఓటమితో పతనం మొదలైంది.అది సార్వత్రిక ఎన్నికలతో పరిపూర్ణం అయింది.
వైవీ సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాల మీద దృష్టి సారించలేకపోవడంతో వర్గ పోరు మొదలైంది. సీనియర్లు పార్టీని వీడారు. ఎన్నికల్లో ఇవన్నీ దెబ్బ తీశాయి. దాంతో వైవీ సుబ్బారెడ్డిని పక్కన పెట్టి ఈ బాధ్యతలను సీనియర్ నేత ఎమ్మెల్యీ కం మండలిలో అపోజిషన్ లీడర్ అయిన బొత్స సత్యనారాయణకు అప్పగించాలని జగన్ ఆలోచిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.
బొత్సకు ఉత్తరాంధ్ర జిల్లాల మీద మంచి పట్టు ఉంది. పైగా బీసీలు నూటికి ఎనభై మంది దాకా ఉంటారు. అలాగే ఓసీ కాపు బీసీ కాపులు ఎన్నికలను ప్రభావితం చేస్తారు. బీసీ కాపు అయిన బొత్సకు కాపులలో బీసీలలో పలుకుబడి ఉంది.
దాంతో పాటు టీడీపీ కూటమి ఎత్తులకు పై ఎత్తులు వేయాలన్నా అంగబలం అర్ధం బలంతో ముందుకు సాగాలన్నా బొత్స వంటి సీనియర్ ఉండాల్సిందే అని అంటున్నారు. లోకల్ గా ఉండే లీడర్ కావడం వల్ల ఉత్తరాంధ్ర మీద ఆయనకు పూర్తి అవగాహన ఉందని అన్ని విషయాలను ఆయన ఆకలింపు చేసుకుని పార్టీని గాడిన పెడతారు అని అంటున్నారు.
దాంతో బొత్స చేతికి ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ పగ్గాలు అందిస్తారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. బొత్స సైతం ఆ బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అదే విధంగా ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలలో సీనియర్లను జిల్లా ప్రెసిడెంట్లుగా చేసి వారి ద్వారా పార్టీని నడిపించాలని కూడా వైసీపీ హై కమాండ్ ఆలోచిస్తోంది అని అంటున్నారు. తొందరలోనే ఈ ప్రక్షాళన మొదలవుతుంది అని అంటున్నారు.