జమిలి ఎన్నికలపై జగన్ కు క్లారిటీ వచ్చేసిందా..?

వాస్తవానికి జమిలీ ఎన్నికల విషయంలో బీజేపీ మొదటి నుంచీ ఉత్సాహం ప్రదర్శిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-10-09 16:30 GMT

నిన్నమొన్నటి వరకూ ఓ మోస్తరుగా వినిపించిన జమిలి ఎన్నికల చర్చలు... హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం మరింత బలంగా వినిపిస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. కేంద్రంలో బీజేపీ చేతిలో అధికారం గడిగడి గండంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీ పెద్దలకు హర్యానా అసెంబ్లీ ఫలితాలు బూస్ట్ ఇచ్చాయని చెబుతున్నారు.

వాస్తవానికి జమిలీ ఎన్నికల విషయంలో బీజేపీ మొదటి నుంచీ ఉత్సాహం ప్రదర్శిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని నియమించడం.. ఆ కమిటీ జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తమ నివేదికను ఇటీవల రాష్ట్రపతికి అందజేయడం సంగతి తెలిసిందే.

ఈ సమయంలో స్థానికంగా బలంగా ఉన్న పలు పార్టీలు.. ప్రజల్లో తమ తమ రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత బలంగా ఉందని నమ్మే ప్రతిపక్షాలు.. జమిలీ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి తాజాగా కేడర్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయని అంటున్నారు.

అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు మాత్రమే పూర్తైన సంగతి తెలిసిందే. అంటే... హనీమూన్ పిరియడ్ కూడా పూర్తి కాలేదు. అయితే... కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని.. ప్రజలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించుకుంటున్నారని చెబుతూ.. కేడర్ లో కొత్త ఆశలు ఇప్పటినుంచే రేపుతున్నారు జగన్!

తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి నేతలతో సమావేశమయ్యారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... గత తమ ప్రభుత్వంలో జరిగిన మంచి గురించి చెబుతూ.. మేనిఫెస్టోని అమలుచేసిన తీరుని గుర్తుచేస్తూ.. నేటి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు విషయంలో సాకులు చెబుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదే క్రమంలో... పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని.. పార్టీ వారందరికీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలని అన్నారు. ఇదే సమయంలొ... రాష్ట్రంలో పార్టీ నిర్మాణం గ్రామస్థాయిలో జరగాల్సిన అవసరం ఉందని.. దీనికి అవసరమైన బూత్ కమిటీలను త్వరలోనే నియమిస్తామని జగన్ హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ఇంకా సుమారు 4 సంవత్సరాల 7 నెలల సమయం ఉందని చాలామంది భావిస్తున్న వేళ... ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఉండాలంటే బూత్ స్థాయి వరకూ పార్టీని నిర్మించుకోవాలని జగన్ వ్యాఖ్యానించారు. దీంతో... జగన్ ఈ స్థాయిలో కేడర్ కు, నాయకులకు దిశానిర్దేశం చేయడం చూస్తుంటే... జమిలీ విషయంలో జగన్ కు ఓ క్లారిటీ ఉన్నట్లుందని అంటున్నారు పరిశీలకులు.

Tags:    

Similar News