జగన్ ఆత్మపరిశీలనకు అవకాశం ఇస్తోన్న బంధువులు, స్నేహితులు!

అధికారంలో ఉన్నప్పుడు అన్నీ బాగున్నట్లే కనిపిస్తాయి! అయినవాళ్లూ, కానివాళ్లూ కూడా అవిరామంగా ప్రేమాభిమానులు కురిపిస్తుంటారు!

Update: 2024-11-16 03:41 GMT

అధికారంలో ఉన్నప్పుడు అన్నీ బాగున్నట్లే కనిపిస్తాయి! అయినవాళ్లూ, కానివాళ్లూ కూడా అవిరామంగా ప్రేమాభిమానులు కురిపిస్తుంటారు! మనం వేసింది జోక్ కాకపోయినా నవ్వుతారు.. మనకు దోమకుట్టినా కన్నీళ్లు పెట్టేస్తుంటారు! మరి అధికారం పోతే...? ఇవన్నీ ఒక్కసారిగా మారిపోతాయి అని అంటారు! ఇది అత్యంత సహజం! అయితే... ఇది పీక్స్ కి చేరితే.. అది జగన్ పరిస్థితి అని చెబుతున్నారు!

అవును... అధికారం ఉన్నప్పుడు అంతా ఉంటారు.. అధికారం దూరం అవ్వగానే చాలా మంది జారుకుంటుంటారు! ఈ సమయంలో మనవాళ్లు ఎవరో, పరాయివారు ఎవరో, అయినవారేవరో, అవకాశవాదులు మరెవరో తెలుసుకునే అవకాశం లభిస్తుంది.. కాదనేది లేదు! అయితే... వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విషయంలో మాత్రం ఇది రక్తసంబంధీకులు, బంధువులు, స్నేహితుల వరకూ వెళ్లిపోయింది!

గత కొన్ని రోజులుగా జగన్ కు రక్తసంబంధీకులు దూరమైపోతున్నారని అంటున్నారు.. సమీప బంధువులు పక్కపార్టీలోకి వెళ్లిపోయారని చెబుతున్నారు.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా దూరమైపోతున్నారని అంటున్నారు.. ఈ క్రమంలో ఇటీవల తన స్నేహితుడు, చిన్ననాటి క్లాస్ మెట్ కూడా జగన్ కు బై బై చెప్పి పసుపు కండువా కప్పేసుకున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు జగన్ ను వీడి వెళ్తున్నారు.

ఇందులో భాగంగానే కొవ్వురూ మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు అల్లుడు, జగన్ చిన్న నాటి స్నేహితుడు, క్లాస్ మెట్ అయిన రాజీవ్ కృష్ణ పార్టీని వదిలి వెళ్లిపోయారు! గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా, అధికార ప్రతినిధిగా వ్యవహరించిన రాజీవ్ కృష్ణ... లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. దీంతో... ఈ జంపింగుల వ్యవహారంపై మరోసారి చర్చ మొదలైంది.

తల్లి ప్రత్యక్షంగా దగ్గరగా లేరని అంటున్నారు.. చెల్లి ప్రధాన ప్రత్యర్థిగా మారారని చెబుతున్నారు.. అయినవాళ్లు కూడా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.. వైఎస్సార్ స్నేహితులు, సహచరులు, సన్నిహితులు వంటి వారు జగన్ దరిదాపుల్లో కూడా లేరని అంటున్నారు! ఇలా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్... దూరమవుతున్న వ్యవహారం జగన్ కు ఏమి నేర్పుతుందనేది ఆసక్తిగా మారింది.

దీనికి కారణం... అధికారంలో ఉంటే కిందా పైనా, చిన్న పెద్ద తెలియకుండా నడుచుకున్న వ్యవహార శైలే కారణమా..? నలుగురు కోటరీని చుట్టూ పెట్టుకుని, ఒంటెద్దు పోకడలకు పోయారని చెబుతోన్న వైనమే కారణమా..? పరిపూర్ణంగా రాజకీయాలు ఒంటబట్టించుకోకపోవడం కారణమా..? జగన్ కి ఇప్పటికైనా స్పష్టత వస్తే వైసీపీ సేఫ్ అని అంటున్నారు! ఆత్మ పరిశీలనకు ఇంతకు మించిన సువర్ణావకాశం లేదని చెబుతున్నారు!

Tags:    

Similar News