వైఎస్ జగన్.. భారతిలు పాస్ పోర్టు ఆఫీసుకు ఎందుకు వెళ్లారు?
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.ఆయనతో పాటు ఆయన సతీమణి భారతి ఉన్నారు. వీరిద్దరి పాస్ పోర్టులు రెన్యువల్ చేసుకోవాల్సి ఉండటంతో వారిద్దరు అక్కడకు చేరుకున్నారు.
రెండు బస్సుల్లో గ్రేటర్ విశాఖకు చెందిన కార్పొరేటర్లు తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. తమపార్టీ అధినేతతో వారు భేటీ అయ్యారు. ఈ నెల ఏడో తేదీన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో భారీ ఎత్తున కార్పొరేటర్లు రెండు బస్సుల్లో వచ్చి మరీ కలవటం ఆసక్తికరంగా మారింది. జీవీఎంసీలో ఇండిపెండెంట్ కార్పొరేటర్ తో కలుపుకొని వైసీపీకి మొత్తం 60 మంది కార్పొరేటర్లు ఉండేవారు.
ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఇందులోని 12 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం.. జనసేనల్లో చేరిపోయారు. దీంతో.. వైసీపీ బలం 48కు తగ్గింది. తాజాగా తాడేపల్లికి వచ్చిన కార్పొరేటర్లు 40 మంది మాత్రమే. మిగిలిన ఎనిమిది మంది డుమ్మా కొట్టారు. తనను కలిసిన కార్పొరేటర్లతో జగన్ అప్యాయంగా మాట్లాడారు. వారి మాటల్లో స్టాండింగ్ కమిటీ ఎన్నిక అంశం వచ్చింది. ఎన్నికల్లో విజయానికి 49మంది కార్పొరేటర్లు అవసరం. జగన్ ను కలిసేందుకు వచ్చిన 40 మంది కార్పొరేటర్లతో.. గెలుపునకు అవసరమైన బలం లేదన్న విషయం స్పష్టమైంది.
ఈ సందర్భంగా తమ పరిస్థితేమిటంటూ మేయర్ హరివెంకట కుమారి.. డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్.. ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ లు జగన్ ను సలహా కోరారు. దీనికి స్పందించిన ఆయన.. అధికారం కోల్పోయిన వేళ ఏ రాజకీయ పార్టీకైనా ఇలాంటి అనుభవం మామూలే అన్న మాట చెప్పినట్లుగా తెలుస్తోంది. కూటమి ఇచ్చిన హామీల అమలు సాధ్యం కాదని.. ఐదేళ్లు ప్రజల్లో ఉండాలన్న సూచన చేసినట్లుగా చెబుతున్నారు.
బలం లేనప్పటికీ.. బరిలో ఉండాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. కార్పొరేటర్లతో పాటు ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి.. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు తదితరులు ఉన్నారు. తాజాగా డుమ్మా కొట్టిన ఎనిమిది మంది త్వరలోనే తెలుగుదేశం, జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు విజయవాడలోని బందర్ రోడ్ లోని పాస్ పోర్టు ఆఫీసుకు వచ్చారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.ఆయనతో పాటు ఆయన సతీమణి భారతి ఉన్నారు. వీరిద్దరి పాస్ పోర్టులు రెన్యువల్ చేసుకోవాల్సి ఉండటంతో వారిద్దరు అక్కడకు చేరుకున్నారు.
పాస్ పోర్టు ఆఫీసులో దాదాపు ఇరవై నిమిషాల పాటు ఉన్న వీరు.. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. జగన్ దంపతులురావటంతో అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. జగన్ దంపతుల వెంట ఎమ్మెల్సీ రఘురాం.. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తోపాటు.. దేవినేని అవినాష్.. మాజీ ఎంపీ నరేష్.. మాజీ ఎమ్మెల్యే మల్లాది విఘ్ణు.. పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. జగన్ దంపతులకు స్వాగతం పలికేందుకు మరింత మంది పాస్ పోర్టుకార్యాలయానికి వచ్చారు. దీంతో అక్కడ హడావుడి నెలకొంది.