జగన్ వర్సెస్ బాబు : ఓడిన వారే లక్కీ ?

ఏపీలో రాజకీయం చూస్తే హోరా హోరీ పోరు ఉంది. పోలింగ్ కి టైం దగ్గర పడింది. పట్టుమని పది రోజులు మాత్రమే ఉంది.

Update: 2024-05-02 04:34 GMT

ఏపీలో రాజకీయం చూస్తే హోరా హోరీ పోరు ఉంది. పోలింగ్ కి టైం దగ్గర పడింది. పట్టుమని పది రోజులు మాత్రమే ఉంది. ఈ నేపధ్యంలో రెండు పార్టీలూ మ్యానిఫేస్టోని రిలీజ్ చేశాయి. జగన్ తాను చేయగలిగింది ఇదే అంటూ పాత పధకాలకు కొంత నగదు అదనం చేసి ప్రకటించారు.

చంద్రబాబు చూస్తే ఆకాశమే హద్దు అన్నట్లుగా అన్ని వర్గాలకు హామీలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేశారు. దీంతో ఎవరు గెలుస్తారు అంటే మళ్లీ సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే ఇద్దరి మ్యానిఫేస్టోలోనూ అభివృద్ధి కంటే సంక్షేమమే ఎక్కువగా ఉంది.

దాని తోనే ఓట్ల పంట పండించుకోవాలని ఆశ ఆరాటం ఉన్నాయి. ఈ క్రమంలో చూస్తే కనుక ఈ ఇద్దరులో ఎవరు గెలిచినా కూడా ప్రభుత్వం నడపాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అంటున్నారు. అదెలా అంటే వారు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఖజానా సపోర్ట్ ఏ మాత్రం సరిపోదు అని ఆర్థిక నిపుణులు తేల్చేస్తున్నారు.

కచ్చితంగా ఆరు నెలల వ్యవధిలో ఇద్దరిలో ఎవరు పవర్ లోకి వచ్చినా తేలిపోతారు అని అంటున్నారు. ఇక ఈ విషయంలో కూడా బాబు కంటే జగన్ కాస్తా బెటర్ అని అంటున్నారు. ఎందుకంటే ఆయన హామీలు అన్నీ కూడా పాతవే. వాటిని అయిదేళ్ళూ నడిపారు. కాబట్టి కిందా మీదా పడి కొంతలో కొంత కొనసాగించవచ్చు. పైగా తక్షణం వేటికీ నగదు అదనంగా పెంచినది లేదు. పెన్షనర్లకు కూడా ఇచ్చేది చివరి సంవత్సరాలలో పెట్టుకున్నారు.

దాంతో జగన్ నెమ్మదిగా బండి లాగవచ్చు అని అంటున్నారు. అయితే ఆయనకు చిక్కు ఏమిటి అంటే అపోజిషన్ ఈసారి బలంగా ఉంటుంది. పైగా ఎక్కువ సీట్లు గెలిచి బాబు అసెంబ్లీకి వస్తారు. ఇక బీజేపీ కూడా కూటమిలో ఉంటుంది. అందువల్ల చూస్తే కనుక కేంద్రం నుంచి గతంలో మాదిరిగా నిధులను కానీ అప్పులను కానీ ఉదారంగా జగన్ తెచ్చుకునే వెసులుబాటు అయితే లేకుండా చూడడంలో బాబు సక్సెస్ అవుతారు అని అంటున్నారు.

ఒక విధంగా అష్ట దిగ్బంధనం చేసి మరీ జగన్ తో రాజకీయ యుద్ధమే అసెంబ్లీ లోపలా బయటా చేస్తారు అని అంటున్నారు. అలా జగన్ కి ఇబ్బంది పెద్ద ఎత్తున ఉంటుందని ఫలితంగా గతంలో మాదిరిగా ఠంచనుగా తన పధకాలను ఇచ్చుకుంటూ పోలేరని అంటున్నారు.

ఇక ఇపుడు చంద్రబాబు విషయానికి వస్తే ఆయన పవర్ లోకి వస్తే కనుక ఆయన తక్షణం నెరవేర్చాల్సిన పధకాలు చాలా ఉన్నాయి.అన్నింటి కంటే ముందు నాలుగు వేలు వంతున సామాజిక పెన్షన్లు అది కూడా 66 లక్షల మందికి ఇవ్వాలి. ఇక వాలంటీర్లకు పదివేలు ఇచ్చి ఇంటింటికీ పధకాలు ఇప్పిస్తామని చెప్పారు. అది నెరవేర్చాలి.

కొత్త ప్రభుత్వం వస్తూనే విద్యా సంవత్సరం కూడా మొదలవుతుంది. దాంతో తల్లికి వందనం కింది ప్రతీ విద్యార్ధికి ఇరవై వేలు ఎందరు ఉంటే అందరికీ ఇవ్వాలి. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అంటున్నారు. ఆర్టీసీ కుదేల్ అయి ఉంది. అయినా ఫ్రీగా నడిపించాలి. ఇలా చాలా హామీలు తోసుకుని ముందే వస్తాయి. వీటితో పాటు ఫ్రీ సిలెండర్లు మూడు ప్రతీ ఇంటికీ అంటే కోటిన్నర కుటుంబాలకు ఈ లెక్క ఎంత అవుతుందో అన్నది కూడా ఆలోచన చేయాల్సిందే కదా. మొత్తం మీద చూస్తే లక్షల కోట్ల వ్యవహారంగా మారుతుంది.

చంద్రబాబు ఈసారి హామీలు నెరవేర్చకుండా ఉండలేరు. అలాగని మానలేరు.బీజేపీ మ్యానిఫేస్టోని చేతిలో ముట్టలేదు, మోడీ ఫోటో పెట్టలేదు, దాంతో మీ బాధ మీరు పడండి అంటుంది. దీంతో చూస్తే కనుక ఆరు నెలలు కూడా కాకుండానే ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో పడిపోతుంది అని ఆర్ధిక నిపుణులే అంటున్నారు. అలా జగన్ అయినా బాబు అయితే గెలిస్తే బ్యాడ్ లక్ ఓడితేనే గుడ్ లక్ అంటున్నారు. ఎందుకంటే పోటీలు పడి ఇచ్చిన హామీలే వారి కాళ్ళకు బంధాలు వేస్తాయి అని అంటున్నారు.

Tags:    

Similar News