మదుసూదన్ రావు గుర్తుపెట్టుకో... పోలీసులతో జగన్ వాగ్వాదం!
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలిరోజు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలిరోజు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. మరోపక్క గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనూ... సభలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున "సేవ్ డెమోక్రసీ" అంటూ నినాదాలు చేస్తున్నారు.
అవును... ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగా... అసెంబ్లీకి తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ నల్లకండువాలతో వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో "హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ" అంటూ నినాదాలు చేశారు.
ఇలా నల్లకండువాలు ధరించి, చేతిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో వస్తోన్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. పోలీసులకు జగన్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో వైసీపీ నేతల చేతిలో ఉన్న ఫ్లకార్డులను పోలీసులు చించివేశారంటూ జగన్ ఫైర్ అయ్యారు.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగా... ఇలా ప్రజా ప్రతినిధుల చేతిలో నుంచి ఫ్లకార్డులు లాక్కుని చించే అధికారం ఎవరిచ్చారంటూ పోలీసులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న పోలీసు అధికారిని ఉద్దేశించి... "మదుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో.. ఎల్లకాలం ఇదేమాదిరి ఉండదు.. ప్రజాస్వామ్యంలో ఉన్నాంమనం" అంటూ రియాక్ట్ అయ్యారు.
ఇక అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, టీడీపీ నేతలు పూలమాలలు వేశారు. మరోవైపు ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం శాంతిభద్రతలపై శ్వేతపత్రాలను సభలో ప్రవేశపెట్టనుంది.