రొయ్యకు మీసం .. బాబుకు మోసం

ఎన్నికల నియమావళి దాటకుండా ప్రచారం నిర్వహించాలని పలువురు నేతలకు ఎన్నికల కమీషన్ నోటీసులు జారీచేసినా కూడా నేతల మాటల్లో వేడి తగ్గడం లేదు.

Update: 2024-04-17 05:54 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ హీటెక్కుతున్నది. విజయవాడలో జగన్ మీద రాయి దాడితో ప్రచారంలో మాటల వేడి పెరిగింది. ఇప్పుడే ఇలా ఉంటే నామినేషన్ల పర్వం మొదలయ్యాక ప్రచార సరళి ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతున్నది. ఎన్నికల నియమావళి దాటకుండా ప్రచారం నిర్వహించాలని పలువురు నేతలకు ఎన్నికల కమీషన్ నోటీసులు జారీచేసినా కూడా నేతల మాటల్లో వేడి తగ్గడం లేదు.

బస్సు యాత్రలో భాగంగా భీమవరంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ‘‘రొయ్యకు మీసం, బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయని, బాబు వస్తే జాబు రాదని, ఉన్న జాబులు ఊడిపోతాయని, 2014 ఎన్నికలలో చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడని, జగన్ కు అనుభవం లేదని, తనకు అపార అనుభవం ఉందని’’ ప్రచారం చేసుకున్నాడని జగన్ విమర్శించాడు. మరి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బుల్లెట్ ట్రైన్ వచ్చిందా ? సింగపూర్ కట్టి ఒలింపిక్స్ నిర్వహిస్తాం అన్నాడు జరిగిందా ? ఎయిర్ పోర్ట్ వచ్చిందా ? రైతు రుణమాఫీ చేశాడా ? ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు ఇచ్చాడా ? రంగుల మేనిఫెస్టోతో పేదలను మోసం చేశాడని జగన్ విమర్శించాడు.

ఇక ఇదే వేదిక మీది నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద జగన్ ఘాటు విమర్శలు చేశాడు. ఒక దత్తపుత్రుడు నాలుగేళ్లకు ఒకసారి కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడని, పెళ్లికి ముందు ప్రమాణాలు చేసి, పిల్లలు పుట్టాక వారిని వదిలేస్తాడని, భార్యలను మార్చినట్లే ఇప్పుడు నియోజకవర్గాలను కూడా మారుస్తున్నాడని విమర్శించాడు. ఎన్నికల తేది దగ్గర పడుతున్న కొద్దీ ఈ విమర్శలు మరింత పదునెక్కేలా కనిపిస్తున్నది. తెలంగాణలో లోక్ సభకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నందున క్షేత్రస్థాయిలో పెద్దగా హడావిడి లేదు. ఆంధ్రాలో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు ఉన్నందున భారీ హడావిడి కనిపిస్తున్నది.

Tags:    

Similar News